ఎస్సీ, ఎస్టీ ఆవాసాలపై సౌర వెలుగులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:22 AM
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద జిల్లాలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రతి ఒక్క ఇంటికీ సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను ఉచితంగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
రూ.1.5 లక్షల విలువచేసే సోలార్ ప్యానళ్లు ఉచితంగా ఏర్పాటు
సామర్థ్యం రెండు కిలోవాట్లు
తెల్ల కార్డుతోపాటు నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడుతున్న వారే అర్హులు
అద్దె రూపంలో నెలకు రూ.200 లబ్ధి
రెండేళ్లకోసారి ఐదు శాతం చొప్పున పెంపు
జిల్లాకు తొలివిడత 12,750 యూనిట్లు మంజూరు
చోడవరం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద జిల్లాలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రతి ఒక్క ఇంటికీ సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను ఉచితంగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలి దశలో 12,750 యూనిట్లు మంజూరుకాగా, సోలార్ ప్యానళ్లను ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తుకు అర్హులైన వారికే ఉచిత సోలార్ యూనిట్లను మంజూరు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పఽథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీచేసింది. ప్రతి ఇంటికి రూ.1.5 లక్షల విలువ చేసే రెండు కిలోవాట్ల సామర్థ్యం వున్న సోలార్ ప్యానళ్లను అమర్చుతారు. అయితే నెలకు 200 యూనిట్లకన్నా తక్కువ విద్యుత్తు వాడుతున్న వారు (ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి) మాత్రమే దీనికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు పక్కా భవనం వుంటే.. శ్లాబ్ మీద సోలార్ ప్యానళ్లు బిగిస్తారు. లేదంటే అందుబాటులో వున్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ రెండూ లేనివారు.. ఇతరుల ఇళ్లపైన సోలార్ ప్యానళ్లను వాళ్ల అనుమతితో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఈపీడీసీఎల్ గ్రిడ్‌కు వెళుతుంది. ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నందున, సోలార్‌ప్యానళ్లు ఏర్పాటు చేసినందుకు నెలకు రూ.200 చొప్పున ఈపీడీసీఎల్ అద్దె రూపంలో ఆయా లబ్ధిదారులకు చెల్లిస్తుంది. జిల్లాలో తొలివిడత 12,750 సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే మండలాల వారీగా జాబితాలను తయారు చేసిన అధికారులు.. ఆయా ఎస్పీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయిస్తున్నారు.
నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారే అర్హులు
వై.సురేశ్‌కుమార్, ఏడీఈ, ఈపీడీసీఎల్, చోడ వ రం
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పఽథకం కింద ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్లకు ఏర్పాటుకు ప్రభుత్వం కొన్ని విధివిధానాలను విడుదల చేసింది. లబ్ధిదారులు కచ్చితంగా తెల్లకార్డుదారులై ఉండాలి. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి అర్హులై వుండాలి. సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నందుకుగాను నెలకు రూ.200 అద్దె రూపంలో ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఈపీడీసీఎల్ నుంచి జమ అవుతాయి. రెండేళ్లకోసారి ఐదు శాతం చొప్పున అద్దె పెరుగుతుంది.