హైవేకు సౌర వెలుగులు
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:06 AM
జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి ప్రదేశాల్లో రాత్రిపూట ప్రమాదాలను నివారించడానికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. అనకాపల్లి నుంచి కాకినాడ జిల్లా అన్నవరం వరకు వివిధ జంక్షన్‌లలో 150 సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు.
రాత్రిపూట ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు
అనకాపల్లి నుంచి అన్నవరం వరకు పలు జంక్షన్లు, బ్లాక్‌స్పాట్ల వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు
ఈ నెలాఖరులోగా పనులు పూర్తి
నక్కపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి ప్రదేశాల్లో రాత్రిపూట ప్రమాదాలను నివారించడానికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. అనకాపల్లి నుంచి కాకినాడ జిల్లా అన్నవరం వరకు వివిధ జంక్షన్‌లలో 150 సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు.
జాతీయ రహదారిపై అనకాపల్లి, పాయకరావుపేట వంటి పట్టణ ప్రాంతాలు, కశింకోట, తాళ్లపాలెం, ఎలమంచిలి వై జంక్షన్ల వద్ద మాత్రమే ఎల్‌ఈడీ లైట్లు వున్నాయి. ప్రధానంగా నక్కపల్లి వంటి మేజర్ పంచాయతీలో హైవేపై లైట్లు లేవు. దీంతో పలు జంక్షన్ల వద్ద రాత్రిపూట జాతీయ రహదారిని దాటే క్రమంలో పలువురు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా బ్లాక్ స్పాట్‌ల వద్ద కూడా వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. అనకాపల్లి- రాజమహేంద్రవరం మధ్య నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లకు విస్తరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం కావడంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రమాదాలను నివారించి, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎక్కువ రద్దీ వుండే జంక్షన్లు, బ్లాక్ స్పాట్‌లలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనకాపల్లి నుంచి అన్నవరం వరకు వివిధ ప్రదేశాల్లో 150 సోలార్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. నక్కపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉపమాక హైవే జంక్షన్ల వరకు 16 సోలార్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇంకా కాగిత, చినదొడ్డిగల్లు, వేంపాడు, ఉద్దండపురం, గొడిచెర్ల, ఒడ్డిమెట్ట జంక్షన్ల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ఆయా ప్రదేశాల్లో గోతుల తవ్వకం పనులను రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఈ నెలాఖరునాటికి సోలార్ లైట్ల ఏర్పాటు పూర్తవుతుందని సంబంధిత కాంట్రాక్టర్ ప్రతినిధులు చెబుతున్నారు.