ఎస్‌సీ, ఎస్‌టీ గృహాలకు సౌర వెలుగులు
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:03 AM
అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లాలో ‘పీఎం సూర్యఘర్-ఎస్‌సీ, ఎస్‌టీ సోలరైజేషన్ పథకం’ లబ్ధిదారులకు ప్యానళ్లు అందజేశారు.
జిల్లాలో 3,595 మందికి ఉచితంగా
సోలార్ ప్యానళ్ల కేటాయింపు
విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లాలో ‘పీఎం సూర్యఘర్-ఎస్‌సీ, ఎస్‌టీ సోలరైజేషన్ పథకం’ లబ్ధిదారులకు ప్యానళ్లు అందజేశారు. చినవాల్తేరు రెల్లివీధిలోని హెలెన్ కెల్లర్ సంస్థలో సోలార్ ప్లాంట్లను ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పథకం కింద కేంద్రం రూ.60 వేలు సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాబార్ద్ ద్వారా రుణం అందించి భరిస్తుందని, దాంతో లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా అందుతుందన్నారు. రెండు కిలోవాట్ల ప్లాంటు ద్వారా నెలకు 240 యూనిట్ల వరకు విద్యుత్ లభిస్తుందన్నారు. సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 3,595 మంది లబ్ధిదారులను గుర్తించి 7.19 మెగావాట్ల ప్లాంట్లను కేటాయించామని, వాటికి రూ.41.35 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇంధన వనరులకు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్ సర్కిల్ ఎస్‌ఈ శ్యాంబాబు, జోన్ ఈఈ పోలాకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తీరంలో సాగర్ కవచ్
48 గంటలపాటు హై అలర్ట్
సాగర్‌నగర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
సాగర తీరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ‘సాగర్ కవచ్’ మాక్‌డ్రిల్ (అభ్యాసం) మంగళవారం ప్రారంభించినట్టు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విన్యాసాలు 48 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్, సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొననున్నాయన్నారు. భీమిలి నుంచి ముత్యాలమ్మపాలెం బీచ్ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 150 మంది భద్రతా సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు తీరప్రాంతాలలో పేలుడు పదార్థాలను అమర్చడం, వాటిని నిర్వీర్యం చేయడం, సముద్రమార్గం ద్వారా చొరబడే శత్రువులను గుర్తించి అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ఈ విన్యాసాల దృష్ట్యా తీరప్రాంతంలోని మత్స్యకారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కొత్త పింఛన్లకు ఎదురుచూపులు
సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు నిరాకరణ
పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తుల వెల్లువ
జిల్లాలో 10 వేలకు పైగా పెండింగ్‌లో ఉండవచ్చునని అధికార వర్గాల అంచనా
విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కొత్త పింఛన్లకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. గత ప్రభుత్వం 2023 జూన్‌లో కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. వికలాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో కొందరు అనర్హులు ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించింది. అయితే దాంతో నిమిత్తం లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తోంది. ప్రస్తుతం వికలాంగులకే కాకుండా వృద్ధులు, వితంతువులు ఎవరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాటికి దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. పింఛన్లు ఆశించేవారు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తులు ఇస్తున్నారు. అధికారులు వాటిని ఆయా జోనల్ కార్యాయాలకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడ వాటిని పరిశీలించాక దరఖాస్తుదారులకు ఒక మెసేజ్ పంపుతున్నారు. ‘ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, ఇస్తే మీ పేరును కూడా పరిశీలిస్తాం’ అని సమాచారం అందుతోంది. విశాఖ జిల్లాలో కొత్త పింఛన్లకు సుమారు పది వేల మంది వరకు దరఖాస్తు చేసుకుని ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు.
నేడు ఇంటర్ ఫలితాలు విడుదల
ఆర్‌ఐవో మురళీధర్
మద్దిలపాలెం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదలవుతాయని ఆర్‌ఐవో బి.మురళీధర్ తెలిపారు. ఫలితాల్లో ఫెయిలయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. ఆత్మస్థైర్యంతో సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ముఖ్యంగా హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులతో ప్రిన్సిపాల్స్ మాట్లాడాలన్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా మానసిక ధైర్యం కల్పించాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ధైర్యాన్ని నింపాలన్నారు.