రాజాం చెరువులో మట్టి దోపిడీ
ABN , Publish Date - Jul 10 , 2026 | 01:01 AM
జిల్లాలో మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సబ్బవరం, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, తదితర మండలాల్లో చెరువులు, ప్రభుత్వ భూములతోపాటు పరిశ్రమల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో మట్టి, గ్రావెల్‌ను యథేచ్ఛగా తవ్వుకుంటూ భారీగా డబ్బులు గడిస్తున్నారు.
రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు
డంపర్ లారీలు, ట్రాక్టర్లతో తరలింపు
రియల్ ఎస్టేట్ వెంచర్లు, పొలాలను ఎత్తు చేయడానికి వినియోగం
అక్రమార్కులకు అధికార పార్టీ నేత అండదండలు
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
అనకాపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సబ్బవరం, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, తదితర మండలాల్లో చెరువులు, ప్రభుత్వ భూములతోపాటు పరిశ్రమల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో మట్టి, గ్రావెల్‌ను యథేచ్ఛగా తవ్వుకుంటూ భారీగా డబ్బులు గడిస్తున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీలకు చెందిన స్థానిక నేతల అండదండలు వున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా బుచ్చెయ్యపేట మండలం తైపురం రెవెన్యూ పరిధిలోని రాజాం సింహాద్రి చెరువులో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వుకుపోతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సుమారు 45 ఎకరాల విస్తీర్ణం వున్న ఈ చెరువులో వారం రోజుల నుంచి రాత్రి పూట ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి, డంపర్ లారీలు, ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ మట్టి తవ్వకాల వెనుక అధికారంలో వున్న ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి వున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు జరుపుతున్న వారు సదరు నాయకుని అనుచరులు కావడంతో స్థానికులు అడ్డుచెప్పడానికి భయపడుతున్నారు. మట్టి తవ్వకందారులతో వైసీపీకి చెందిన ఒక నాయకుడు కూడా జత కలిసినట్టు చెబుతున్నారు. చెరువులో తవ్విన మట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్లు, పల్లంగా వున్న భూములను ఎత్తు చేయడానికి తరలిస్తున్నారు. వారం రోజుల నుంచి చెరువులో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడలేదు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి తైపురం రెవెన్యూ పరిధిలోని సింహాద్రి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.