భూసార పరీక్షలతో ఎంతో మేలు
ABN , Publish Date - May 08 , 2026 | 01:42 AM
రైతులు భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య పోషక యాజమాన్యం చేపడితేనే సాగు ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందని హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం భూసార శాస్త్రవేత్త డాక్టర్ బి. శ్రీహరిరావు అన్నారు.
- తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు
- బీసీటీ కేవీకే భూసార శాస్త్రవేత్త బి.శ్రీహరిరావు
రాంబిల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి ):
రైతులు భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య పోషక యాజమాన్యం చేపడితేనే సాగు ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందని హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం భూసార శాస్త్రవేత్త డాక్టర్ బి. శ్రీహరిరావు అన్నారు. గురువారం ఆయన మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల ప్రాధాన్యతపై రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేలలో సహజంగా ఉండే పోషకాలను తెలుసుకొని అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు వాడడం వలన ఖర్చు తగ్గుతుందన్నారు. రసాయన ఎరువుల అతి వినియోగాన్ని అరికట్టి నేల కాలుష్యాన్ని నివారించవచ్చునని చెప్పారు. దీని వల్ల దిగుబడి పెరగడమే కాకుండా అనవసరపు ఎరువుల ఖర్చు తగ్గడం వలన రైతులకు లాభం చేకూరుతుందన్నారు. రైతులు తమ పొలంలో మట్టి నమూనాలను సేకరించేటప్పుడు పలు నియమాలను పాటించాలన్నారు. పొలంలో నిల్వ ఉన్న నీరు, చెత్తచెదారం ఉన్న చోట మట్టిని తీయకూడదని, చెట్ల కింద, గట్ల వెంట లేదా ఎరువుల కుప్పలు వేసిన చోట నమూనాలు సేకరించకూడదని చెప్పారు. ఎకరా పొలంలో 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించి వాటన్నింటిని బాగా కలిపి చివరిగా అరకిలో మట్టిని గుడ్డ సంచిలో నింపి సమీప భూసార పరీక్షా కేంద్రానికి పంపాలన్నారు. నమూనాతో పాటు రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం మరియు గతంలో వేసిన పంట, రాబోయే కాలంలో వేయదలచిన పంట వివరాలు జతచేయాలన్నారు. మరింత సమచారం కోసం 94407 10538 ఫోన్ నంబర్‌ను సంప్రతించాలని ఆయన కోరారు.