అంతకాపల్లిలో మట్టి దోపిడీ
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:32 AM
మండలంలోని అంతకాపల్లి రెవెన్యూ పరిధి గౌరమ్మ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా సుమారు రెండు నెలల నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. వాహనాల రాకపోకల కోసం చెరువు గట్టును ధ్వంసం చేశారు. రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో మట్టిన తవ్వి, డంపర్ లారీల్లో తరలిస్తున్నారు.
గౌరమ్మ చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు
పట్టించుకోని జలవనరుల శాఖ అధికారులు
సబ్బవరం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంతకాపల్లి రెవెన్యూ పరిధి గౌరమ్మ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా సుమారు రెండు నెలల నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. వాహనాల రాకపోకల కోసం చెరువు గట్టును ధ్వంసం చేశారు. రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో మట్టిన తవ్వి, డంపర్ లారీల్లో తరలిస్తున్నారు. చెరువు మట్టిన పొలాలను ఎత్తు చేయడానికి మాత్రమే వినియోగించాలి. కానీ అంతకాపల్లిలోని గౌరమ్మ చెరువులో తవ్విన మట్టిన ఇటుక తయారీ బట్టీలు, ఖాళీ స్థలాలను ఎత్తుచేయడానికి, పునాదులు నింపడానికి, లేఅవుట్లలో అభివృద్ధి పనులకు తరలిస్తున్నారు. దూరాన్నిబట్టి డంపర్ లారీ మట్టిని రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు విక్రయిస్తున్నారు చెరువులో మట్టి తవ్వకాలకు కొంతమంది స్థానికులు సహకరిస్తున్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు. ఒక్కో లోడుకు రూ.500లకు తక్కువ కాకుండా అక్రమార్కుల నుంచి వసూలు చేస్తున్నారు. కాగా అంతకాపల్లి గౌరమ్మ చెరువులో మట్టి తవ్వకాలపై జలవనరుల శాఖ జేఈ కార్తీక్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. గైరమ్మ చెరువులో మట్టి తవ్వకాల కోసం ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. పంట పొలాలను ఎత్తు చేయడానికి చెరువులో మట్టి కోసం ఎవరైనా రైతులకు దరఖాస్తు చేసుకుంటే, తహశీల్దారు ఇచ్చిన పర్మిట్ మేరకు మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఇస్తామన్నారు.