Share News

మట్టి, గ్రావెల్‌ దోపిడీ

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:17 AM

సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. గత కొంత కాలం నుంచి స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు.. కొద్ది రోజుల నుంచి రాత్రి, పగలు అన్న తేడా లేకుండా చెరువులను గుల్ల చేస్తూ, కొండలను కొల్లగొడుతున్నారు. ఎక్స్‌కవేటర్లతో మట్టి, గ్రావెల్‌ తవ్వి, భారీ డంపర్‌ లారీల్లో తరలిస్తున్నారు. ప్రైవేటు లేఅవుట్లలో రహదారుల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి, ఇళ్ల నిర్మాణంలో పునాదులను నింపడానికి మట్టి, గ్రావెల్‌ను వినియోగిస్తుండడంతో డిమాండ్‌ పెరిగింది.

మట్టి, గ్రావెల్‌ దోపిడీ
గాలిభీమవరంలో జగనన్న కాలనీని అనుకొని కొండవాలు ప్రదేశంలో గ్రావెల్‌ తవ్వుకుపోయిన దృశ్యం

సబ్బవరం మండలంలో జోరందుకున్న తవ్వకాలు

పగలు, రాత్రి తేడా లేకుండా రవాణా

గనులు, రెవెన్యూ శాఖల్లో కిందిస్థాయి సిబ్బంది సహకారం

సబ్బవరం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. గత కొంత కాలం నుంచి స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు.. కొద్ది రోజుల నుంచి రాత్రి, పగలు అన్న తేడా లేకుండా చెరువులను గుల్ల చేస్తూ, కొండలను కొల్లగొడుతున్నారు. ఎక్స్‌కవేటర్లతో మట్టి, గ్రావెల్‌ తవ్వి, భారీ డంపర్‌ లారీల్లో తరలిస్తున్నారు. ప్రైవేటు లేఅవుట్లలో రహదారుల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి, ఇళ్ల నిర్మాణంలో పునాదులను నింపడానికి మట్టి, గ్రావెల్‌ను వినియోగిస్తుండడంతో డిమాండ్‌ పెరిగింది. వాస్తవంగా మండలంలో ఎక్కడా గనుల శాఖ అనుమతి వున్న గ్రావెల్‌ క్వారీలు లేవు. ఇది అక్రమార్కులకు బాగా కలిసొచ్చింది. సాగునీటి చెరువుల్లో నుంచి మట్టిని,. కొండవాలు ప్రదేశాల్లో గ్రావెల్‌ను తవ్వుకుపోతున్నారు. మండల పరిధిలో అయితే దూరాన్ని బట్టి డంపర్‌ లారీకి రూ.7 వేల నుంచి రూ.8 వేలు, మండలం దాటితే రూ.10 వేలకుపైబడి వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. కానీ గనుల శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. గనులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు దాడులు చేయడానికి వస్తుంటే.. ముందుగానే సమాచారం వచ్చేలా ‘నెట్‌వర్క్‌’ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో కింది స్థాయి ఉద్యోగులకు మామూళ్లు ఇచ్చి, తమకు సహకరించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు ఎక్కడంటే..

ఆరిపాక శివారు పెదయాతపాలెం జగనన్న కాలనీకి అనుకొని ఉన్న శేషమయ్య చెరువులో భారీ యంత్రాలతో మట్టిని తవ్వి, పట్టపగలు డంపర్‌ లారీల్లో తరలించుకుపోతున్నారు. అంతకాపల్లి గౌరమ్మ చెరువులో కూడా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకల కోసం చెరువు గట్టును ధ్వంసం చేశారు. గాలిభీమవరం, పైడివాడ, పైడివాడఅగ్రహారం, రాయపురఅగ్రహారం, గొల్లలపాలెం గ్రామాల్లో కొండవాలు ప్రదేశాల్లో గ్రావెల్‌ తవ్వి తరలించుకుపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మండలంలో మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 01:17 AM