Share News

మండుతున్న ధరలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:59 AM

పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావం వల్ల అనేక వస్తువుల రేట్లు పెరిగిపోయాయి.

మండుతున్న ధరలు

నిమ్మకాయలు కిలో రూ.180

కొబ్బరి బొండాం రూ.50-రూ.60

తాటిముంజలు డజను రూ.80-100

సమ్మర్‌ ఎఫెక్ట్‌

అల్లాడిపోతున్న వినియోగదారులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి):

పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావం వల్ల అనేక వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. మొబైల్‌ ఫోన్లు, టీవీల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. వంట గ్యాస్‌ ఇబ్బందులు ఇప్పటికీ తొలగలేదు. సిలిండర్‌ బుక్‌ చేసి పది రోజులైనా డెలివరీ ఇవ్వడం లేదు. ఇవిలా ఉంటే వేసవి ఎండలను అడ్డం పెట్టుకొని ఈ సీజన్‌లో వినియోగించే నిత్యవసరాల ధరలను కూడా పెంచేశారు.

ఎండన తిరిగి వచ్చిన వారికి ఇంట్లో నిమ్మకాయ నీళ్లు ఇవ్వడం రివాజు. ప్రతి ఒక్కరూ నిమ్మకాయలను ఉపయోగిస్తారు. ఇంతకు ముందు కిలో రూ.70 నుంచి రూ.80కి లభించేవి. అవి కూడా పసుపు రంగులో నిగనిగలాడుతూ మెరిసేవి. రైతుబజార్‌ బయట ఇరవై రూపాయలకు ఎనిమిది నుంచి పది ఇచ్చేవారు. ఇప్పుడు పసుపు రంగు నిమ్మకాయలు ఎక్కడా దొరకడం లేదు. ఆకుపచ్చ రంగులో గోళీకాయ కంటే కొంచెం పెద్ద సైజులో వస్తున్నాయి. వాటిని కిలో రూ.180 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. వాటిని కోస్తే రసం కూడా రావడం లేదు. నెల్లూరు సమీపానున్న గూడూరు, గుంటూరు దగ్గరున్న సత్తెనపల్లి నుంచి నిమ్మకాయలు విశాఖపట్నం హోల్‌సేల్‌ మార్కెట్‌కు వస్తాయి. అక్కడ పంట దిగుబడి లేదని, అందుకే రేటు ఎక్కువగా ఉందని అంటున్నారు.

అలాగే వేసవి తాపం తగ్గడానికి కొబ్బరి బొండాం నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ సీజన్‌లో వీటికి డిమాండ్‌ అధికం. ఇటు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, అటు గోదావరి జిల్లాల నుంచి విశాఖపట్నం తీసుకువచ్చి విక్రయిస్తారు. ఇవి ఇంతకు ముందు ఒక్కొక్కటి రూ.30 చొప్పున అమ్మేవారు. లీటరు కొబ్బరి నీరు అయితే రూ.100 నుంచి రూ.120 తీసుకునేవారు. ఇప్పుడు అదే కొబ్బరి బొండాం రూ.50కి అమ్ముతున్నారు. కొంచెం పెద్ద సైజు ఉంటే రూ.60 నుంచి రూ.70 డిమాండ్‌ చేస్తున్నారు. లీటరు కొబ్బరి నీరు రూ.140 చేసేశారు. రైతుల వద్ద ధర పది రూపాయలు ఉంటే...ఇక్కడ అంతకు నాలుగింతలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారంలో దళారులే లాభపడుతున్నారు.

తాటిముంజల రేట్లు కూడా ఈ ఏడాది భారీగా పెంచేయడం గమనార్హం. డజను ముంజలు రూ.80 నుంచి రూ.100 చొప్పున జాతీయ రహదారి పక్కన అమ్ముతున్నారు. ఇవే ముంజలు మొన్నటివరకు రైతుబజార్ల గేట్ల వద్ద డజను రూ.40కి విక్రయించారు. అందరూ అన్ని రేట్లు పెంచుతున్నందున మనం పెంచితే తప్పేంటి అనే ధోరణి అందరిలో కనిపిస్తోంది. వీటికి ఎంఆర్‌పీలు ఏమీ ఉండవు కాబట్టి అడిగేవారు కూడా ఉండడం లేదు. ఇంట్లో అంతా కొబ్బరిబొండాలు తాగితే రూ.200 ఖర్చవుతోంది. ఇంటికి వచ్చిన వారికి నిమ్మకాయ నీళ్లు ఇవ్వడం కూడా ఇప్పుడు కష్టంగా మారుతోంది.

Updated Date - Apr 24 , 2026 | 12:59 AM