ఆ ఆరుగురి ఆచూకీ లేనట్టే?
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:10 AM
సముద్రంలో మత్స్యకారుల బోటు మునిగి సరిగ్గా వారం రోజులు అయ్యింది.
వారం క్రితం సముద్రంలో బోటు బోల్తా
మత్స్యకారుల కోసం మూడు రోజులపాటు నేవీ, కోస్ట్‌గార్డు గాలింపు
కానరాని జాడ
రిప్ కరెంట్‌తో సముద్రం లోపలకు మృతదేహాలు?
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
సముద్రంలో మత్స్యకారుల బోటు మునిగి సరిగ్గా వారం రోజులు అయ్యింది. గల్లంతైన ఆరుగురి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. వారి కోసం కుటుంబీకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రాణాలతో ఉంటే ఏ తీరానికో చేరి ఉంటారని, చనిపోతే కనీసం మృతదేహమైనా ఎక్కడో చోట ఒడ్డుకు కొట్టుకు వస్తుందని భావిస్తున్నారు. అధికారులు మాత్రం ఆ అవకాశం లేదని అంటున్నారు.
గత శనివారం గంగవరం పోర్టు సమీపాన కారి చిన్నాకు చెందిన బోటు సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తూ మునిగిపోయిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకు బోటుతో పాటు ఒకరు మునిగిపోయారు. మిగిలిన ఆరుగురిలో బోటు ఓనరు, డ్రైవర్ కారి చిన్నా ఒక్కరే ఈదుకుంటూ చైనా నౌక సాయంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం ముందు బలమైన అలకు బోటు తిరగబడిందని, ఆ తరువాత క్రమంగా మునిగిపోయిందని పేర్కొన్నారు. అంతా కలిసి ఈదుకుంటూ బయలుదేరామని, తాను ముందు ఉండగా మిగిలిన వారు వెనుక వచ్చారని, కొద్ది దూరం వెళ్లేసరికి వెనుక ఎవరూ కనిపించలేదని వివరించారు.
రిప్ కరెంట్ వల్ల సముద్రం లోపలికి వెళ్లిన మృతదేహాలు
బోటు ప్రమాదం జరిగిన సమయంలో సముద్ర వాతావరణం బాగా లేదు. బలమైన గాలులు వీస్తున్నాయి. అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం లోపల రిప్ కరెంట్ కూడా ఉంది. సాధారణంగా తీరానికి దగ్గరలో ఎవరైనా మునిగిపోతే కొద్ది సమయం తరువాత మృతదేహం తీరానికి చేరుతుంది. కానీ గంగవరం పోర్టుకు పది నాటికల్ మైళ్ల దూరంలో వీరి బోటు మునిగిపోయింది. నడి సముద్రం కిందే లెక్క. రిప్ కరెంట్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరైనా సముద్రంలో పడిపోతే వారిని సముద్రం లోపలకు లాక్కుపోతుంది. ఆ తరువాత ఏ వైపునకు తీసుకుపోతుందో తెలియదు. వీరి విషయంలోను అదే జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి నేవీ, కోస్టుగార్డు, కోస్టల్ సెక్యూరిటీ అంతా కలిసి 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. కొందరు నౌకల్లో మరికొందరు హెలికాప్టర్లలో సముద్రం అంతా గాలించారు. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. వేటకు వెళ్లిన మత్స్యకారులకు కూడా ఎక్కడా ఆనవాళ్లు లభించలేదు. అందుకే ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ రాగోతు బండియ్య (43), మేడ చిన్నఅమ్మోరు (48), కారి చిన్నయ్య (32), కారి సీతోడు (55), అమర అప్పలరాజు (24), కారి గరగయ్య (24) మరణించినట్టుగా భావిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ వెంటనే మత్స్య శాఖ అధికారులు బీమాతో పాటు నష్టపరిహారం కలిపి రూ.10 లక్షలు చొప్పున అందించారు.
దొరికినా గుర్తింపు కష్టమే
గాలింపు చర్యలు ఆపేసిన తరువాత కూడా ఎక్కడైనా తీరానికి మృతదేహాలు కొట్టుకువస్తే ఆ సమాచారం అందించాలని అధికారులు మత్స్యకార గ్రామాల్లో పనిచేసే ‘సాగరమిత్ర’లకు తెలియజేశారు. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. మృతదేహం వారం రోజులు సముద్రంలో ఉంటే ఉబ్బిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఏదైనా మృతదేహం దొరికిగా గుర్తు పట్టడానికి వీల్లేని విధంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. సాధారణంగా మత్స్యకారులు సముద్రంలో గల్లంతైతే మూడేళ్లు ఎదురుచూసి, ఆ తరువాత నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపుతారని, అప్పుడు నష్టపరిహారం వస్తుందని ఓ మత్స్యకార నాయకుడు తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం 72 గంటల తరువాతే కమిటీ ద్వారా నివేదిక తీసుకుందని, గతంలో ఇలా ఏనాడూ తక్షణ సాయం అందలేదని వివరించారు.