Share News

బాలలు బడిబాట పట్టేలా..

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:28 AM

బడి బయట ఒక్క చిన్నారి కూడా ఉండకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. మహిళలు, చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.

బాలలు బడిబాట పట్టేలా..
అనకాపల్లి మండలం రేబాకలో అంగన్‌వాడీ పిలుస్తోంది ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

- జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమాలు

- కేంద్రాల్లో అందే సేవలపై అవగాహన

- 20వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ

- తల్లుల నుంచి విశేష స్పందన

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

బడి బయట ఒక్క చిన్నారి కూడా ఉండకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. మహిళలు, చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.

నూతన విద్యా సంవత్సరానికి ముందుగా 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్రాలను రంగురంగుల బెలూన్లు, ముగ్గులతో అలంకరించి చిన్నారులకు స్వాగతం పలుకుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను ఆహ్వానించడంతో నమోదు ప్రక్రియ వేగవంతం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం, ప్రీస్కూల్‌ విద్య, ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారిని లబ్ధిదారులుగా నమోదు చేస్తున్నారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను ప్రత్యక్షంగా చూపిస్తూ తల్లుల్లో అవగాహన పెంచుతున్నారు. జిల్లాలో మొత్తం 1,908 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, ప్రస్తుతం 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 17,238 మంది ఆటపాటల విద్యను అభ్యసిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా చేరే చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో శనివారం సాయంత్రానికి అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమాల ద్వారా 756 మంది బాలలకు కొత్తగా కేంద్రాల్లో ప్రవేశాలు కల్పించారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశానికి ముందే అంగన్‌వాడీల్లో ప్రాథమిక విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందుతుండడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

-------------

స్పందన బాగుంది

అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమానికి స్పందన బాగుంది. ఈ నెల 1వ తేదీ నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 756 మంది బాలలు కొత్తగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. మరింత మంది బాలలు అంగన్‌వాడీల్లో చేరే అవకాశం ఉంది.

- సూర్యలక్ష్మి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి

Updated Date - Jun 07 , 2026 | 12:28 AM