Share News

అరకులోయలో స్నోయగం

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:56 PM

అరకులోయలో శనివారం మంచు అందాలు సందర్శకులను మైమరపించాయి.

అరకులోయలో స్నోయగం
మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌కు వెళ్లే దారిలో మంచు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు

పర్యాటకులను అలరిస్తున్న మంచు అందాలు

వ్యూపాయింట్ల వద్ద సందర్శకుల సందడి

కిటకిటలాడిన పర్యాటక ప్రదేశాలు

అరకులోయ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

అరకులోయలో శనివారం మంచు అందాలు సందర్శకులను మైమరపించాయి. తెల్లవారు జాము నుంచి విపరీతంగా కురవడంతో ప్రకృతి ప్రేమికులు మంచు అందాలకు పిదా అయిపోయారు. సహజసిద్ధ ప్రకృతి అందాలకు మంచు సోయగం తోడవడంతో పర్యాటకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ముఖ్యంగా మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు తెలవారకముందే చేరుకొని మంచు అందాల నడుమ గిరిజన దింసా కళాకారులతో నృత్యం చేశారు. సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ నుంచి లోయ అంతా పాలసముద్రాన్ని మరిపించింది. మంచు తెరల నడుమ సూర్యోదయం దృశ్యాన్ని సెల్‌ కెమెరాల్లో బంధించారు. ఎటుచూసినా మంచు ఆవహించడంతో సందర్శకులు బాగా ఎంజాయ్‌ చేశారు. అదేవిధంగా సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్‌, అరకులోయలోని ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌లను పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శించారు. సెలవులు కలిసి రావడంతో సందర్శకులు భారీగా వచ్చారు. రిసార్టులు, లాడ్జీలు, హోటళ్లు కిటకిటలాడాయి.

Updated Date - Oct 03 , 2026 | 11:56 PM