మండు వేసవిలో మంచు సోయగం
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:46 PM
మన్యంలోని వాతావరణంలో మార్పుల కారణంగా ఆదివారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. మండు వేసవిలో మంచు కురిసింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కొయ్యూరులో 38.6 డిగ్రీలు
పాడే రు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని వాతావరణంలో మార్పుల కారణంగా ఆదివారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. మండు వేసవిలో మంచు కురిసింది. తెల్లవారుజామున నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు అలముకుంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో వాతావరణంలోని మార్పులు చోటుచేసుకుని ఆదివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఆదివారం మధ్యాహ్నం ఎండ తీవ్రంగానే కాసింది. అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం ఆకాశం మబ్బులు పట్టింది. వాతావరణంలో ఎన్ని మార్పులు జరిగినా గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా, రాత్రి పగలు తేడా లేకుండా ఉక్కపోత కొనసాగుతున్నది. ఏజెన్సీలో ఆదివారం కొయ్యూరులో 38.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా జి.మాడుగులలో 37.4, అరకులోయలో 37.0, పెదబయలులో 35.7, చింతపల్లిలో 35.0, ముంచంగిపుట్టులో 34.1, అనంతగిరిలో 33.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.