నగరాన్ని కమ్మేసిన పొగ, మంచు
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:15 AM
నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. ఇవి అనేకచోట్ల తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ కొనసాగాయి. భోగి మంటల ప్రభావంతో నగరమంతా పొగ కమ్మేసింది. ఒకవైపు మంచు, మరోవైపు పొగతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
పడిపోయిన గాలి నాణ్యత సూచీ
బుధవారం 189గా నమోదు
విశాఖపట్నం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. ఇవి అనేకచోట్ల తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ కొనసాగాయి. భోగి మంటల ప్రభావంతో నగరమంతా పొగ కమ్మేసింది. ఒకవైపు మంచు, మరోవైపు పొగతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్నిచోట్ల ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే భోగి మంటల వల్ల వ్యాపించిన పొగ కారణంగా నగరంలో గాలి నాణ్యత పడిపోయింది. గత నెలలో గాలి నాణ్యత తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే, గడిచిన వారం రోజుల నుంచి నాణ్యత సూచీ మెరుగు పడుతూ వచ్చింది. తారురోడ్డుపై భోగి మంటలు వేయకూడదని అధికారులు సూచించినప్పటికీ కొందరు పట్టించుకోకపోవడంతో పొగ మరింత పెరిగింది. దీంతో నగరంలో గాలి నాణ్యత సూచీ 189కు చేరింది. గడిచిన వారం, పది రోజుల నుంచి గాలి నాణ్యత సూచీ 100 నుంచి 120 మధ్య నమోదవుతోంది. కానీ, అనూహ్యంగా బుధవారం 189గా నమోదైంది. అయితే, 200 వరకూ నమోదైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.