ఎస్‌ఎంసీ ఎన్నికలు రేపు
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:11 PM
జిల్లాలోని 2,034 విద్యాలయాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలను ఈ నెల 29న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో 2,034 విద్యాలయాల్లో నిర్వహణకు సన్నాహాలు
విద్యార్థుల సంఖ్య ఆధారంగా సభ్యులు
పాడేరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 2,034 విద్యాలయాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలను ఈ నెల 29న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల కాలపరిమితితో ఉండే పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)లకు సంబంధించిన ఓటరు జాబితాను ఈ నెల 18న ప్రదర్శించి, 25న ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ, అదే రోజు సాయంత్రం 4 గంటలకు జాబితా ఖరారు చేసి ప్రదర్శించారు. 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటలకు నూతన పాఠశాల యాజమాన్య కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు.
ఈ ఏడాది ఎస్‌ఎంసీలో మారిన మార్గదర్శకాలు
పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి ఈ ఏడాది మార్గదర్శకాలను కాస్త మార్చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా సభ్యుల సంఖ్య ఉండాలనే నిబంధనను రూపొందించారు. దీంతో 100 మందిలోపు విద్యార్థులంటే 12 నుంచి 15 మంది సభ్యులు, 100 నుంచి 500 మంది ఉంటే 15 నుంచి 20 మంది సభ్యులు, 500 మంది పైబడి విద్యార్థులుంటే 20 నుంచి 25 మంది సభ్యులుండాలని సూచిస్తున్నారు. అలాగే మొత్తం కమిటీలో 75 శాతం పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులుండాలని, మిగిలిన 25 శాతం ఉపాధ్యాయులు, పంచాయతీ సభ్యులు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలుండాలి. మొత్తం కమిటీ సభ్యుల్లో 50 శాతం మహిళలుండాలనే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.
పారదర్శకంగా నిర్వహించాలి
జిల్లాలోని 2,034 పాఠశాలల్లోనూ పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ వీఏ స్వామినాయుడు పేర్కొన్నారు. ఈ నెల 15న ఎస్‌ఎంసీ నోటిఫికేషన్ జారీ, ఉన్నతాఽధికారులు ఆదేశాల మేరకు ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రశాంత వాతావరణం పాటించాలని, అన్ని పాఠశాలల్లోనూ నిర్దేశించిన నిబంధనల మేరకు ఎన్నికలు జరగాలన్నారు. ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను శతశాతం పక్కాగా అమలు చేసి, ఎన్నికలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.