ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:40 AM
జిల్లాలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలకు తావులేకుండా అధిక సంఖ్యలో పాఠశాలల్లో ఏకగ్రీవంగానే కమిటీలను ఎన్నుకున్నారు.
- జిల్లాలో 2,034 విద్యాలయాల్లో నిర్వహణ
- పకడ్బందీగా ఏర్పాట్లు
పాడేరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలకు తావులేకుండా అధిక సంఖ్యలో పాఠశాలల్లో ఏకగ్రీవంగానే కమిటీలను ఎన్నుకున్నారు. కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, మండల విద్యాశాఖాధికారులు, సీఆర్‌పీలు, సిబ్బంది ఎస్‌ఎంసీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు గత వారం రోజులుగా అవసరమైన పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. ఫలితంగా జిల్లాలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగాయని సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు అన్నారు.
జిల్లాలో 2,034 విద్యాలయాల్లో ఎన్నికలు
జిల్లాలోని మొత్తం 11 మండలాల పరిధిలో 2,034 విద్యాలయాల్లో మంగళవారం స్కూల్ మేనేజ్‌మెంట్ ఎన్నికలు జరిగాయి. వాటిలో సుమారుగా లక్షా 50 వేల మంది విద్యార్థులు, 25 వేల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో అనంతగిరిలో 176 విద్యాలయాల్లో, అరకులోయలో 153, చింతపల్లిలో 211, డుంబ్రిగుడలో 170, జీకేవీధిలో 191, జి.మాడుగులలో 205, హుకుంపేటలో 215, కొయ్యూరులో 154, ముంచంగిపుట్టులో 203, పాడేరులో 163, పెదబయలు మండలంలో 193 విద్యాలయాల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారు.