Share News

ఎండాడ, దువ్వాడల్లో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లు

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:24 AM

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) స్మార్ట్‌ సిటీగా ఎదుగుతున్న నగరంలో వీధి వ్యాపారాలను క్రమబద్ధీకరించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు జీవీఎంసీ స్మార్ట్‌ వెండింగ్‌జోన్‌లు ఏర్పాటు చేయబోతోంది.

ఎండాడ, దువ్వాడల్లో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లు

పనులు ప్రారంభం

అర్హులైన వీధి వ్యాపారులకు దుకాణాలు కేటాయింపు

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమే లక్ష్యం

కోర్టు వివాదంతో నిలిచిన పాతజైలురోడ్డులో వెండింగ్‌ జోన్‌ పనులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్మార్ట్‌ సిటీగా ఎదుగుతున్న నగరంలో వీధి వ్యాపారాలను క్రమబద్ధీకరించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు జీవీఎంసీ స్మార్ట్‌ వెండింగ్‌జోన్‌లు ఏర్పాటు చేయబోతోంది. అర్హులైన వీధి వ్యాపారులకు స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లలో దుకాణాలను కేటాయించనున్నది. ప్రజలకు, వ్యాపారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఇప్పటికే ఎండాడ, దువ్వాడల్లో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఆగస్టు నెలాఖరునాటికి నిర్మాణాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నగరంలో రహదారులను సైతం కొందరు ఆక్రమించి దుకాణాలను ఏర్పాటుచేస్తున్నారు. ఆ దుకాణాలకు వచ్చేవారంతా తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. మరోవైపు ఫుట్‌పాత్‌లను సైతం కొందరు వ్యాపారులు ఆక్రమించుకున్నారు. దీనివల్ల ఫుట్‌పాత్‌లపై నడవాల్సినవారంతా రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లకు రూపకల్పన చేశారు. నగరంలోని రోడ్లు, జీవీఎంసీ స్థలాలను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలను కొన్నాళ్ల కిందట ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో తొలగించారు. దీంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లు ఏర్పాటుచేసినట్టయితే...వారికి ఉపాధి అవకాశం కల్పించడంతోపాటు నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేయవచ్చునని కమిషనర్‌ భావించారు. దీనికోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నగరంలో 21 చోట్ల స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఉన్నట్టు కమిషనర్‌కు నివేదించారు. మొదటి దశలో ఎండాడ, పాతజైలురోడ్డు, దువ్వాడ ఫ్లైఓవర్‌బ్రిడ్జి కింద స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లను నిర్మించేందుకు వీలుగా కౌన్సిల్‌ ఆమోదంతో నిధులు కేటాయించారు. అత్యాధునిక సదుపాయాలతో కంటెయినర్‌ దుకాణాలను ఏర్పాటుచేసి, వాటికి అవసరమైన విద్యుత్‌ సరఫరా, తాగునీరు, డ్రైనేజీ సదుపాయం వంటి వాటిని కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. దీనికయ్యే ఖర్చును జీవీఎంసీ, కేంద్ర ప్రభుత్వం, లబ్ధిదారుడు సమానంగా భరించాల్సి ఉంటుంది. జీవీఎంసీ వాటా కింద మౌలిక సదుపాయాలు కల్పిస్తే, లబ్ధిదారుడు తన వాటాగా మెప్మా ద్వారా రుణం తీసుకుని సర్దుబాటుచేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇతర పనులు చేస్తారు. ఎండాడ, దువ్వాడల్లో 70 దుకాణాలు చొప్పున, పాతజైలురోడ్డులో 110 దుకాణాలు ఏర్పాటుచేసేలా డిజైన్‌చేశారు. అయితే పాత జైలురోడ్డులోని స్థలం, అనుమతులపై కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో పనులు నిలిచిపోయాయి. ఎండాడ, దువ్వాడల్లో మాత్రం ఇటీవలే పనులు ప్రారంభించారు. నగరంలో అర్హులైన వీధి వ్యాపారులను ప్రత్యేక కమిటీ ద్వారా గుర్తించి, వారికి అందుబాటులో ఉన్న దుకాణాలను కేటాయిస్తారు.


ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి

కేతన్‌గార్గ్‌, జీవీఎంసీ కమిషనర్‌

నగరంలో మూడు చోట్ల స్మార్ట్‌ వెండింగ్‌జోన్‌ పనులు ప్రారంభించగా, కోర్టు కేసు వల్ల పాతజైలురోడ్డు వద్ద నిలిచిపోయాయి. మిగిలిన రెండు చోట్ల పనులను శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాం. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వెంటనే అర్హులైన వారికి దుకాణాలను కేటాయించి స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ సమస్య తగ్గడంతోపాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వస్తుంది. మిగిలిన జోన్‌లలో పనులను దశల వారీగా ప్రారంభిస్తాం.

Updated Date - Jul 31 , 2026 | 01:24 AM