Share News

సెంట్రల్‌ పార్కు వద్ద స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌కు బ్రేక్‌

ABN , Publish Date - May 08 , 2026 | 01:31 AM

సిటీ సెంట్రల్‌ పార్కును ఆనుకుని పాత జైలురోడ్డులో ఏర్పాటుచేయతలపెట్టిన స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌కు బ్రేక్‌ పడింది.

సెంట్రల్‌ పార్కు వద్ద  స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌కు బ్రేక్‌

రూ.6 కోట్లతో 200కిపైగా దుకాణాలు ఏర్పాటుకు ఇటీవల పనులు ప్రారంభం

నిబంధనలకు విరుద్ధమంటూ కోర్టులో పిటిషన్‌

పనులు నిలిపివేయాలని ఆదేశించిన న్యాయస్థానం

అయోమయంలో అధికారులు, ఆశావహులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సిటీ సెంట్రల్‌ పార్కును ఆనుకుని పాత జైలురోడ్డులో ఏర్పాటుచేయతలపెట్టిన స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌కు బ్రేక్‌ పడింది. అనుమతులు తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా రూ.ఆరు కోట్ల వ్యయంతో దుకాణాలకు ఏర్పాటుచేస్తున్నారంటూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు పనులను తక్షణం నిలిపివేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అధికారులు, దుకాణాలు ఆశిస్తున్న వారిలో అయోమయం నెలకొంది.

నగరంలో రోడ్లపక్కన ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారిన దుకాణాలు, తోపుడుబండ్లను జీవీఎంసీ అధికారులు ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో కొన్నాళ్ల కిందట తొలగించారు. దుకాణాలను తొలగించడంతో ఉపాధి కోల్పోయిన వారికి స్మార్ట్‌ వెండింగ్‌జోన్‌ల ఏర్పాటుతో ప్రత్యామ్నాయం చూపించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ముందుగా ఎండాడ, పాతజైలురోడ్డులో వీఎంఆర్‌డీఏ సెంట్రల్‌పార్కును ఆనుకుని ఉన్న స్థలం, దువ్వాడలో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ల ఏర్పాటుచే యడానికి జీవీఎంసీ కౌన్సిల్‌ ఉన్నప్పుడు అనుమతి తీసుకున్నారు. కంటెయినర్‌ మాదిరిగా ఉండే దుకాణాలను ఏర్పాటుచేయడంతోపాటు డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్‌ సదుపాయం కూడా జీవీఎంసీయే కల్పిస్తుంది. దువ్వాడ, ఎండాడ ప్రాంతాల్లో రూ.4.5 కోట్లు చొప్పున, పాతజైలురోడ్డులో రూ.ఆరు కోట్లు వ్యయంతో స్మార్ట్‌ వెండింగ్‌జోన్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనికయ్యే వ్యయంలో ఒక వాటాను రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ద్వారా కంటెయినర్‌ల తయారీకి సర్దుబాటు చేస్తే, ఒక వాటాను జీవీఎంసీ సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తుంది. మిగిలిన వాటాను లబ్ధిదారులు బ్యాంక్‌ రుణం ద్వారా జీవీఎంసీకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాతజైలురోడ్డులో గతంలో తొలగించిన ఫుడ్‌కోర్టు స్థలంలో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ పేరుతో తిరిగి ఫుడ్‌ కోర్టు ఏర్పాటుచేసేందుకు ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఆ స్థలం వీఎంఆర్‌డీఏకు చెందినది కావడంతో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ ఏర్పాటుకు అనుమతించాలంటూ ఆ సంస్థను జీవీఎంసీ అధికారులు కోరారు. అయితే అక్కడి నుంచి ఇంతవరకు లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు ఒత్తిడితో సుమారు 200 దుకాణాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించేశారు. పనులు ప్రారంభం కాగానే దుకాణాలను కేటాయించేలా చూస్తామంటూ కొందరు ఆశావహుల నుంచి రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్హులైన వారికి, ఆపరేషన్‌ లంగ్స్‌ కారణంగా నిజంగా జీవనోపాధి కోల్పోయినవారికి దుకాణాలు ఇస్తామని చెప్పి, మార్కెట్‌లో వేలంపాట మాదిరిగా విక్రయించేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదుచేశారు. అయినప్పటికీ పనులు ఆపకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం కోర్టు స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ పనులను తక్షణం నిలిపివేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో త్వరగా దుకాణాల ఏర్పాటుపూర్తిచేసి ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందాలనుకున్న అధికారులతోపాటు డబ్బులు ఇచ్చి దుకాణాలపై గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులకు షాక్‌ తగిలింది. హైకోర్టు ఆదేశాలు నేపథ్యంలో కొత్తగా ఎలాంటి నిబంధనలను అమలు చేస్తారోనని కొందరు, అసలు ఆ స్థలంలో ఫుడ్‌కోర్టు ఏర్పాటుకు కోర్టు అనుమతిస్తుందా?, లేదా? అని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - May 08 , 2026 | 01:31 AM