Share News

స్మార్ట్‌ సిలిండర్లు వచ్చేశాయ్‌!

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:27 AM

చమురు సంస్థలు (ఇండియన్‌ ఆయిల్‌/ హెచ్‌పీసీఎల్‌/ భారత్‌) ఆధునిక సాంకేతికతతో తయారుచేసిన 10 కేజీల కాంపోజిట్‌ ఎల్‌పీజీ సిలిండర్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

స్మార్ట్‌ సిలిండర్లు  వచ్చేశాయ్‌!

అందుబాటులోకి పది కేజీల కాంపోజిట్‌ సిలిండర్లు

బుక్‌ చేసుకోవడం సులువు

బరువు తక్కువ కావడంతో రవాణా సులభం

వెంకోజీపాలెం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

చమురు సంస్థలు (ఇండియన్‌ ఆయిల్‌/ హెచ్‌పీసీఎల్‌/ భారత్‌) ఆధునిక సాంకేతికతతో తయారుచేసిన 10 కేజీల కాంపోజిట్‌ ఎల్‌పీజీ సిలిండర్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. పాత ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఇది మరింత సురక్షితమైన, తేలికైన, చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సాధారణ ఇనుప సిలిండర్ల కంటే దీని బరువు దాదాపు సగం మాత్రమే ఉంటుంది. సులభంగా గృహిణులు కూడా తీసుకువెళ్లే వీలుంది. ఈ సిలిండర్‌ పారదర్శక బాడీతో తయారుచేయడంతో అందులో ఎంత గ్యాస్‌ ఉందో, ఎప్పుడు అయిపోతుందో చూసి ముందుగానే రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చు. కాంపోజిట్‌ ఫైౖబర్‌ మెటీరియల్‌తో రూపొందించడం వల్ల కిచెన్‌ ఫ్లోర్‌పై మరకలు పడవు. ఈ సిలిండర్‌లు మూడు పొరలతో అత్యంత ద్రుఢంగా తయారుచేశారని, ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నా పేలిపోవని గ్యాస్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. వ్యాపారులు, బ్యాచిలర్లు, చిన్న కుటుంబాలకు పది కేజీల సామర్థ్యం గల గ్యాస్‌ సిలిండర్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.

బుక్‌ చేసుకోవడం ఎలా?

ఇప్పటికే ఉన్న పాత సిలిండర్‌ ఇనుముతో చేయడంతో 14.2 కేజీల బరువుంటుంది. వినియోగదారులు గ్యాస్‌ ఏజెన్సీని సంప్రదించి, డిపాజిట్‌ వ్యత్యాసాన్ని చెల్లించి పది కేజీల కాంపోజిట్‌ సిలిండర్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చు.

గ్యాస్‌ కంపెనీల యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చు.

రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు ద్వారా గ్యాస్‌ కంపెనీ అధికారిక వాట్సాప్‌/ఎస్‌ఎంఎస్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు.

తమ పరిధిలోని గ్యాస్‌ ఏజెన్సీ/ డిస్ట్రిబ్యూటర్‌ను నేరుగా సంప్రదించి, కొత్త కాంపోజిట్‌ సిలిండర్‌ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

సబ్సిడీ, బుకింగ్‌తో సంబంధం లేకుండా ఈ సిలిండర్‌ను పొందేందుకు ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పీజీ (ఎఫ్‌టీఎల్‌) లేదా నాన్‌ సబ్సిడైజ్‌డ్‌ కనెక్షన్‌ ఆప్షన్‌ కూడా ఉంది.

గుర్తింపు ఆధారంగా, చిరునామా లేకపోయినా కాంపోజిట్‌ గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు.

ఏదైనా గ్యాస్‌ ఏజెన్సీలో రూ.3 వేల నుంచి రూ.3,500 చెల్లించి కంపోజిట్‌ గ్యాస్‌ సిలిండర్‌ను పొంది, రూ.650 నుంచి రూ.700 చెల్లించి గ్యాస్‌ను ఫిల్‌ చేయించుకోవచ్చు.

Updated Date - Aug 10 , 2026 | 12:27 AM