పీపీపీలో మురికివాడల అభివృద్ధి
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:16 AM
మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ముందుకువెళ్లాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ భావిస్తున్నారు. అందుకోసం తొలిదశలో నగరంలోని దొండపర్తి, వెలంపేట మురికివాడలను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, యూసీడీ విభాగం అధికారులను వెంటబెట్టుకుని ఇటీవల ఆ రెండు మురికివాడలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వం అనుమతిస్తే కార్యాచరణ ప్రారంభించాలని కమిషనర్ నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ యోచన
మొదటి రెండు, మూడు ఫోర్లు వాణిజ్య అవసరాలకు...
ఆపైన నివాసాలు
మొదట దొండపర్తి, వెలంపేట మురికివాడలు ఎంపిక
ఇటీవల అధికారులతో కలిసి పరిశీలన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ముందుకువెళ్లాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ భావిస్తున్నారు. అందుకోసం తొలిదశలో నగరంలోని దొండపర్తి, వెలంపేట మురికివాడలను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, యూసీడీ విభాగం అధికారులను వెంటబెట్టుకుని ఇటీవల ఆ రెండు మురికివాడలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వం అనుమతిస్తే కార్యాచరణ ప్రారంభించాలని కమిషనర్ నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
జీవీఎంసీ పరిధిలో సుమారు వందకుపైగా నోటిఫైడ్ మురికివాడలు ఉన్నట్టు అంచనా. అందులో కొన్నింటిపై వివాదాలు కొనసాగుతుండగా, మరికొన్ని మురికివాడల భూములకు సంబంధించి వాటి యజమానులకు టీడీఆర్‌లు జారీచేయడంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. అయితే టీడీఆర్‌లు జారీచేయడం వల్ల వివాదాలు తొలగిపోయినా మురికివాడల్లో ప్రస్తుతం ఉంటున్నవారు అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితి లేదు. తమకు అక్కడ ఇల్లు కట్టి ఇస్తేనే ఖాళీ చేయడానికి సమ్మతిస్తామంటున్నారు. అందుకోసం జీవీఎంసీ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా భూమిని ప్రైవేటు వ్యక్తులకు పీపీపీ విధానంలో అప్పగిస్తే జీవీఎంసీకి ఆర్థిక భారం లేకుండా మురికివాడల్లో ఉంటున్నవారికి అన్ని సదుపాయాలతో పక్కా ఇంటి సదుపాయం కల్పించడంతోపాటు మురికివాడను నిర్మూలించినట్టు అవుతుందని కమిషనర్ భావిస్తున్నారు. నగర శివారున, పాతనగరంలో ఉండే మురికివాడలను అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకువచ్చే పరిస్థితి లేకపోయినా, నగర నడిబొడ్డున, వాణిజ్య ప్రాంతాలకు అనుకుని ఉన్న మురికివాడల అభివృద్ధికి ప్రైవేటు వ్యక్తులు పోటీపడే అవకాశం ఉంది. దాంతో ముందుగా దొండపర్తి సిగ్నల్ వద్ద ఉన్న మురికివాడతోపాటు పాత నగరంలోని వెలంపేటలో ఉన్న మురికివాడను పీపీపీ విధానంలో అభివృద్ధికి కమిషనర్ ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఆ రెండు మురికివాడలను కమిషనర్ కేతన్‌గార్గ్ వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. దొండపర్తి వద్ద సుమారు 1,200 గజాల్లో ఉన్న మురికివాడలో 66 కుటుంబాలు ప్రస్తుతం షెడ్‌లు వేసుకుని ఉంటున్నాయి. వారికి బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. ఆ మురికివాడను ప్రైవేటు వ్యక్తికి అభివృద్ధి చేసేలా ఇస్తే బాగుంటుందని కమిషనర్ భావిస్తున్నారు. దొండపర్తి నుంచి డైమండ్ పార్కుకు వెళ్లే వంద అడుగుల రోడ్డుని ఆనుకుని ఉండడంతో బహుళ అంతస్థుల భవనం నిర్మించుకునేందుకు వీలుంటుంది. అక్కడ ఏడెనిమిది అంతస్థుల భవనం నిర్మించి, గ్రౌండ్ ఫ్లోర్‌ను పార్కింగ్‌కు, ఒకటి, రెండు అంతస్థులను కమర్షియల్ అవసరాలకు, ఆపైన అంతస్థుల్లో మురికివాడల్లో ఉంటున్న వారికి ఇళ్లను నిర్మిస్తే ఎలా ఉంటుందని కమిషనర్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మొదటి రెండు అంతస్థులు వాణిజ్య అవసరాలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి, ప్రైవేటు వ్యక్తులు భవన నిర్మాణానికి ముందుకు వస్తారని అధికారులు సైతం చెబుతున్నారు. అక్కడ షెడ్‌ల్లో ఉంటున్నవారు కూడా తమకు అక్కడే ఇళ్లు నిర్మించి ఇస్తే అభ్యంతరం లేదని చెప్పినట్టు పేర్కొంటున్నారు. అయితేవన్‌టౌన్‌లోని వెలంపేటలో సుమారు రెండు వేల గజాల్లో ఉన్న మురికివాడ అభివృద్ధికి మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఆసక్తి చూపడం కష్టమని అధికారులు అంటున్నారు. వెలంపేటలో వ్యాపారం క్రమేణా తగ్గిపోతోందని, కాలుష్యం కారణంగా చాలా భవనాలు ఖాళీగా ఉంటున్న పరిస్థితిలో అక్కడ భవన నిర్మాణాలకు ప్రైవేటు వ్యక్తులు సాహసించరు కాబట్టి, వెలంపేట మురికివాడ అభివృద్ధి సాధ్యం కాకపోవచ్చునని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దొండపర్తి, వెలంపేట మురికివాడల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన తర్వాత అక్కడి నుంచి ఆమోదం వస్తే ముందుకు వెళ్లాలని కమిషన్ భావిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.