మందకొడిగా బాణసంచా అమ్మకాలు
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:53 AM
బాణసంచా అమ్మకాలు ఈ ఏడాది కాస్త మందకొడిగా సాగుతున్నాయి.
గడిచిన ఏడాదితో పోలిస్తే పండుగ ముందురోజు విక్రయాలు
పది నుంచి 20 శాతం మేర తగ్గాయంటున్న వ్యాపారులు
ఆదివారం వ్యాపారంపైనే ఆశలు
గడిచిన ఏడాదితో పోలిస్తే పది శాతం మేరకు పెరిగిన ధరలు
విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):
బాణసంచా అమ్మకాలు ఈ ఏడాది కాస్త మందకొడిగా సాగుతున్నాయి. ఏయూ ఫుట్‌బాల్ గ్రౌండ్, పెదవాల్తేరు రైతుబజారు వెనుక, మధురవాడ, ఎన్‌ఏడీ, గాజువాక, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా 500 వరకూ దుకాణాలు ఏర్పాటుచేశారు. అయితే గడిచిన ఏడాదితో పోలిస్తే వ్యాపారం తక్కువగా ఉందని దుకాణదారులు చెబుతున్నారు. గడిచిన రెండు, మూడేళ్లతో పోలిస్తే పండుగ ముందురోజు అమ్మకాలు సుమారు పది నుంచి 20 శాతం మేర తగ్గాయంటున్నారు. దాంతో ఆదివారం జరిగే అమ్మకాలపై ఆశలు పెట్టుకున్నారు. మరీముఖ్యంగా ఏయూ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన స్టాళ్లలో విక్రయాలు దారుణంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఏయూ ప్రధాన మైదానంలో కాకుండా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో స్టాల్స్ పెట్టడమే అందుకు కారణంగా వ్యాపారులు భావిస్తున్నారు. సాధారణంగా దీపావళి రోజున ఏటా వర్షాలు పడుతుంటాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో అమ్మకాలు భారీగా సాగుతాయని వ్యాపారులు అంచనా వేశారు. అయితే, అందుకు భిన్నమైన వాతావరణం ఉండడంతో నిరాశలో కూరుకుపోయారు. ఇకపోతే, బాణసంచా ధరలు కూడా గడిచిన ఏడాదితో పోలిస్తే పది శాతం మేర పెరిగినట్టు పేర్కొంటున్నారు.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఒక్కోబాక్స్‌పై 20 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్, స్పెషల్ ప్యాక్, చిల్డ్రన్ ప్యాక్‌లను రూ.3 వేలు నుంచి రూ.5 వేలు వరకు ధరల్లో విక్రయాలు సాగిస్తున్నారు.
ఇవీ ధరలు..
వస్తువు గత ఏడాది ధర ఈ ఏడాది ధర
చిచ్చుబుడ్లు బాక్స్ (పది) 450 500
1000 వాలా 700 850
10000 వాలా 3500 4500
లక్ష్మీ బాంబ్ బాక్స్ (50) 350 450
కాకర పువ్వొత్తులు ప్యాకెట్ 300 380
(10 బాక్స్‌లు)
భూ చక్రాలు (బాక్స్ 10) 250 360
ఫ్లవర్ పాట్స్ (చిచ్చుబుడ్డీలు) బాక్స్ 315 350
రాకెట్స్ స్మాల్ 190 250
గ్రీన్ క్రాకర్స్ బాక్స్ 550 680
60 షాట్స్ 1450 1650
120 షాట్స్ 2700 2800
విష్ణు చక్రాలు బాక్స్ 200 280
కిడ్స్ ప్యాక్ 750 890
చిల్డ్రన్ ప్యాక్ 750 890
యూత్ ప్యాక్ 950 1150