మందకొడిగా సర్
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:28 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జిల్లాలో ఒకింత మందకొడిగానే సాగుతున్నది. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని, ఈ నెల 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ (డిజిటలైజేషన్) చేయాలి. ఓటర్లకు ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినప్పటికీ వారి నుంచి పూర్తి చేసిన ఫారాలను తిరిగి తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. అధికారుల గణాంకాల ప్రకారం ఇంతవరకు సుమారు 40 శాతం ఫారాలను మాత్రమే అప్‌లోడ్ చేశారు.
మరో 11 రోజులే గడువు
జిల్లాలో 13,02,389 మంది ఓటర్లు
12,83,264 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ
ఇంతవరకు 5,12,187 ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్
46.06 శాతంతో మొదటి స్థానంలో నర్సీపట్నం
34.66 శాతంతో అట్టడుగున అనకాపల్లి
నర్సీపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జిల్లాలో ఒకింత మందకొడిగానే సాగుతున్నది. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని, ఈ నెల 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ (డిజిటలైజేషన్) చేయాలి. ఓటర్లకు ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినప్పటికీ వారి నుంచి పూర్తి చేసిన ఫారాలను తిరిగి తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. అధికారుల గణాంకాల ప్రకారం ఇంతవరకు సుమారు 40 శాతం ఫారాలను మాత్రమే అప్‌లోడ్ చేశారు.
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,529 పోలింగ్ స్టేషన్లు వున్నాయి. మొత్తం 13,02,389 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని గత నెల 15వ తేదీన ప్రారంభించారు. బీఎల్‌వోలు తమ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి. ఓటర్లు వాటిని భర్తీ చేసి తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వాలి. వివరాలన్నీ సక్రమంగా వున్న ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు డిజిటలైజేషన్ చేయాలి. ఈ మొత్తం ప్రక్రియను జూలై 14వ తేదీనాటికి పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. శుక్రవారం సాయంత్రానికి జిల్లాలో 12,83,264 మంది (98.53 శాతం) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. వీటిలో 5,12,187 ఫారాలను (39.91 శాతం) మాత్రమే డిజిటలైజేషన్ చేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు ఇంకా పూర్తిచేసి ఇవ్వకపోవడంతో బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. బీఎల్‌వోలు ఓటర్ల ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడికక్కడే ఎన్యూమరేషన్ ఫారాలు నింపించి, వారితో సంతకాలు చేయించుకుంటే సరిపోయేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
నర్సీపట్నం నియోజవర్గం టాప్
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో నర్సీపట్నం నియోజకవర్గం మొదటి స్థానంలో, అనకాపల్లి నియోజకవర్గం చివరి స్థానంలో ఉన్నాయి. నర్సీపట్నంలో 2,14,090 ఓటర్లు ఉండగా 2,070,75 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇంతవరకు 98,613 మందికి (46.06 శాతం) చెందిన ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఎలమంచిలిలో 2,088,51 మంది ఓటర్లకుగాను 2,049,16 మందికి ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 89,623 ఫారాలను (42.91 శాతం) డిజిటలైజేషన్ చేశారు. పాయకరావుపేటలో 2,53,393 మంది ఓటర్లు ఉండగా 2,51,040 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 95,167 మంది (37.56 శాతం) ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. చోడవరంలో 2,19,895 మంది ఓటర్లు ఉండగా 2,18,422 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇంతవరకు 82,826 మంది (37.67 శాతం) ఫారాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. మాడుగులలో 1,90,545 మంది ఓటర్లు ఉండగా 1,90,440 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. వీరిలో 71,216 మంది (37.37 శాతం) నుంచి ఫారాలు తీసుకొని డిజిటలైజేషన్ చేశారు. అనకాపల్లిలో 2,15,615 ఓటర్లు ఉండగా 2,11,371 మందికి ఫారాలు పంపిణీ చేశారు. 74,745 మందికి (34.66 శాతం) చెందిన ఫారాలను డిజిటలైజేషన్ చేశారు.