వర్షంతో స్వల్ప ఊరట
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:52 AM
వాయువ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. పలు మండలాల్లో జల్లులతోపాటు మోస్తరు వర్షం కురిసింది. నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో వరి నారుమళ్లకు ఈ వర్షం జీవం పోసిందని రైతులు చెబుతున్నారు. చోడవరం మండలంలో తెల్లవారుజాము నుంచి విడతల వారీగా మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా వుంది.
పలచోట్ల మోస్తరు జల్లులతో వరి నారుమళ్లకు జీవం
(ఆంధ్రజ్యోతి- న్యూస్ నెట్‌వర్క్)
వాయువ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. పలు మండలాల్లో జల్లులతోపాటు మోస్తరు వర్షం కురిసింది. నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో వరి నారుమళ్లకు ఈ వర్షం జీవం పోసిందని రైతులు చెబుతున్నారు. చోడవరం మండలంలో తెల్లవారుజాము నుంచి విడతల వారీగా మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా వుంది. అయితే మేఘాలు కమ్ముకున్న స్థాయిలో వర్షం కురవలేదని రైతులు నిరాశ చెందారు. మాడుగుల మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు దఫదఫాలుగా తేలికపాటి జల్లులు పడ్డాయి. వర్షం మరింత ఎక్కువ పడితే బాగుండేదని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. గొలుగొండ, మునగపాక, చీడికాడ మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడపాదడపా జల్లులు పడ్డాయి. రావికమతం మండలంలో కురిసిన మోస్తరు వర్షం వరి నారుమడులకు ఊపిరిపోసిందని రైతులు చెబుతున్నారు.