మండిపోతున్న కూరగాయలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:07 AM
నగరంలో కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. రైతుబజార్లకు వెళితే అవసరమైన సరకులన్నీ లభించడం లేదు.
వర్షాభావంతో దిగుబడులు తగ్గడమే కారణం
టమాటా రూ.40
బెండకాయలు రూ.48
గోరుచిక్కుడు రూ.40
దేముడు చిక్కుడు రూ.72
కాలీఫ్లవర్ రూ.40
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. రైతుబజార్లకు వెళితే అవసరమైన సరకులన్నీ లభించడం లేదు. ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లినా కొన్నిరకాలు మాత్రమే ఉంటున్నాయి. తీవ్ర వర్షాభావం వల్ల పంటల దిగుబడులు లేవని రైతులు చెబుతున్నారు.
రైతుబజార్లకు కూరగాయలు చాలామంది హోల్‌సేల్ మార్కెట్ నుంచి తీసుకువచ్చి అమ్ముతుంటారు. సీజనల్‌గా బీర, బెండ, వంకాయ, దొండ, బరబాటి, ఆనప వంటివి మాత్రమే కొద్దిమొత్తంలో పండించి అమ్మకానికి తీసుకువస్తారు. మిగిలినవన్నీ జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్‌లోనే కొంటారు. బీన్స్, క్యారెట్, బీట్ రూట్, క్యాబేజీ, టమాటా వంటివి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడం, తీవ్రమైన ఎండలు కాయడంతో ఏ పంటలు వేయలేని పరిస్థితి ఎదురైంది. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాలో రామభద్రపురం వంటి ప్రాంతాల్లో కూరగాయల సాగు తగ్గింది. దిగుబడులు పడిపోయాయి. దాంతో డిమాండ్ ఏర్పడి కూరగాయలు అధిక రేట్లు పలుకుతున్నాయి. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా వ్యయం కూడా పెరిగింది. గతంలో కిలో బరబాటి, బెండ, దొండకాయలు రూ.20కి లభించేవి. ఇప్పుడు అవి రెట్టింపు అయ్యాయి. ప్రతి రకం కిలో రూ.40, అంతకంటే ఎక్కువకే అమ్ముతున్నారు. చిక్కుడు రకాలు అయితే కొన్ని బజార్లలో కనిపించడమే లేదు. రేట్లు ఎక్కువగా ఉన్నాయని రైతులు కొని తేవడం లేదు. పది నుంచి పదిహేను రూపాయలకు ఇచ్చే ఆనపకాయ సైతం రూ.25 చేసి అమ్ముతున్నారు. టమాటా నెమ్మదిగా రేటు పెరుగుతోంది. రెండు వారాల క్రితం రూ.25 నుంచి రూ.30 మధ్య ఉన్న ధర ఇప్పుడు రూ.40 దాటిపోయింది. బెండకాయలు రూ.48కి అమ్ముతున్నారు. గోరుచిక్కుడు రూ.40, దేముడు చిక్కుడు రూ.72, గ్రీన్ పీస్ రూ.110, కాలీఫ్లవర్ రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నా అవసరమైన రకాలు బజార్లలో దొరకడం లేదని, మార్కెటింగ్ శాఖాధికారులు హోల్‌సేల్ వ్యాపారులతో మాట్లాడి, అన్ని రకాలు తెచ్చేలా చూడాలని రైతులు, కొనుగోలుదారులు కోరుతున్నారు.
నేటి నుంచి రాయితీ ఉల్లి విక్రయాలు
కిలో రూ.35
మనిషికి రెండు కిలోలు మాత్రమే
విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):
రైతుబజార్లలో రాయితీ ఉల్లి విక్రయానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల క్రితం ‘రాయితీ ఉల్లి?’ ఎక్కడ అంటూ...‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖా మంత్రులు నాదెండ్ల మనోహర్, కె.అచ్చెన్నాయుడు స్పందించారు. విజయవాడలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అక్కడ రాయితీ ఉల్లి విక్రయాలకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం జిల్లాకు శుక్రవారం సుమారు 38 టన్నుల ఉల్లిని రప్పించారు. దీనిని పెద్ద బజార్లయిన ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, గోపాలపట్నం, అక్కయ్యపాలెం, పెందుర్తి బజార్లకు మూడు టన్నుల చొప్పున పంపిణీ చేశారు. వాటిని శనివారం నుంచి రైతుబజార్లలో డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రైతుబజార్లలో కిలో రూ.54 చొప్పున విక్రయిస్తుండగా, రాయితీపై కిలో రూ.35 చొప్పున ఇస్తారు. అయితే సరకు తక్కువగా ఉన్నందున, అందరికీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డుపై మనిషికి రెండు కిలోలు చొప్పున ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.