Share News

పేలుతున్న టపాసుల ధరలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:50 AM

దీపావళి పండుగ సందర్భంగా టపాసుల ధరలు బాగా మండుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగినట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు.

పేలుతున్న టపాసుల ధరలు
ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణం

గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వరకు పెరుగుదల

అనకాపల్లి టౌన్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ సందర్భంగా టపాసుల ధరలు బాగా మండుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగినట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. పట్టణంలోనిఇ రింగురోడ్డులో హోల్‌సేల్‌ దుకాణాలు ఉండగా, చిల్లర వ్యాపారులు ఎన్టీఆర్‌ స్టేడియంలో దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. దీపావళి సామగ్రి ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా శనివారం ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగడంతో స్టేడియంలోని దుకాణాలు సాయంత్రం వరకు వెలవెలబోయాయి. హోల్‌సేల్‌ దుకాణాల వద్దకు అగనంపూడి, గాజువాక, స్టీల్‌ప్లాంట్‌ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఎక్కువగా వచ్చి బాణసంచా కొనుగోలు చేశారు. గత ఏడాది సాదా కాకర పువ్వొత్తుల బాక్సు రూ.70 ఉండగా ఈసారి రూ.80కి పెరిగింది. రంగుల కాకర పువ్వొత్తుల బాక్సు రూ.100 నుంచి రూ.130, చిచ్చుబుడ్డుల బాక్స్‌ రూ.160 నుంచి రూ.200లకు, 100 వాలా రూ.60 నుంచి రూ.80కి, థౌజెండ్‌ వాలా రూ.250 నుంచి రూ.350కి, బాంబుల బాక్సు రూ.250 నుంచి 350కి పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలావుండగా శనివారం సాయంత్రం ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడడంతో గెలుపొందిన అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు పెద్ద మొత్తంలో బాణసంచా కొనుగోలుచేసి కాల్చారు.

Updated Date - Nov 08 , 2026 | 01:50 AM