ఏయూ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:11 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థి ఉద్యోగంతో లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా బయటకు వెళ్లాలన్న ఉద్దేశంతో అధికారులు ఇటీవల ‘ఆ హబ్’ ప్రాంగణంలో కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (సీపీడీసీ)ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు వారి ఆలోచనలను గుర్తించి ప్రోత్సహించనున్నారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తుఅవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్సిటీ అధికారులు ఈ సెంటర్‌కు శ్రీకారం చుట్టారు.
పరిశ్రమలకు అవసరమయ్యే
సాఫ్ట్, సబ్జెక్ట్ స్కిల్స్ నేర్పించేలా కార్యాచరణ
వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం
ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నవారికి సహకారం
క్యాంపస్‌లో కెరీర్ ప్లానింగ్ అండ్
డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్,
ట్రైనింగ్ అండ్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఇందులో భాగమే
ఒక డీన్, నలుగురు అసోసియేట్ డీన్లు,
ఇద్దరు ప్లేస్‌మెంట్ ఆఫీసర్లతో టీమ్ ఏర్పాటు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థి ఉద్యోగంతో లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా బయటకు వెళ్లాలన్న ఉద్దేశంతో అధికారులు ఇటీవల ‘ఆ హబ్’ ప్రాంగణంలో కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (సీపీడీసీ)ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు వారి ఆలోచనలను గుర్తించి ప్రోత్సహించనున్నారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తుఅవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్సిటీ అధికారులు ఈ సెంటర్‌కు శ్రీకారం చుట్టారు.
విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను తొలి ఏడాది నుంచే ఈ సెంటర్ ద్వారా అందిస్తారు. అలాగే, విద్యార్థుల్లో ఉన్న విభిన్న ప్రతిభా పాటవాలను గుర్తించి ఎదగడానికి అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. ఇందుకోసం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతోపాటు సాఫ్ట్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కిల్స్ నేర్పించేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే వినూత్నమైన ఆవిష్కరణలు చేసే విద్యార్థులకు మెంటారింగ్ చేయడం, ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకువెళ్లేందుకు అవసరమైన ఆర్థిక, ఇతర సహకారాన్ని ఈ కేంద్రం ద్వారా అందించనున్నారు.
తొలి ఏడాది నుంచే కార్యాచరణ
వర్సిటీలో చేరే విద్యార్థుల ఆసక్తి, అభిరుచులను తొలి ఏడాదిలోనే సీపీడీసీ సెంటర్ అధికారులు తెలుసుకుంటారు. సీపీడీసీ సెంటర్‌కు సహకారాన్ని అందించడంతోపాటు విద్యార్థులకు అందించాల్సిన శిక్షణ, మెంటారింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ప్రతి డిపార్టుమెంట్‌లో ఫ్యాకల్టీ, స్టూడెంట్ కో-ఆర్డినేటర్ ఉంటారు. వీరి నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వీరు ఆయా డిపార్టుమెంట్‌లలో ఉండే విద్యార్థుల నైపుణ్యాల పట్ల ఒక అవగాహనకు వచ్చిన తరువాత వారికి అందించాల్సిన శిక్షణ వివరాలను సీపీడీసీ సెంటర్ అధికారులకు తెలియజేస్తారు. వారికి విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నట్టు చెబుతున్నారు.
ఒకే గొడుగు కిందకు..
ప్రస్తుతం వర్సిటీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెంటర్, సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (నైపుణ్య శిక్షణ కేంద్రం), ఆ హబ్ (వినూత్న ఆవిష్క రణలను ప్రోత్సహించి సహకారాన్ని అందించే కేంద్రం) ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని ల్యాబ్‌లు ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థులకు అవసర మైన సహకారాన్ని అందిస్తూ వస్తున్నాయి. ఇవన్నీ, వేర్వేరుగా ఇప్పటి వరకూ కార్యకలా పాలను నిర్వహిస్తూ వస్తున్నాయి. అయితే, వీట న్నింటినీ ఇప్పుడు వర్సిటీ అధికారులు సీపీడీసీ కిందకు తీసుకువచ్చారు. కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీపీడీసీ సెంటర్‌కు ఒక డీన్‌ను, మరో నలుగురు అసోసియేట్ డీన్లను అధికారులు నియమించారు. అలాగే, ఇద్దరు ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు ఉంటారు. విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతోనే ఈ సెంటర్‌ను ఏర్పాటుచేశామని డీన్ ప్రొఫెసర్ వజీర్ మహమూద్ తెలిపారు. ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. వెస్ట్రన్ ఆస్ర్టేలియాతో కొద్దిరోజుల కిందట ఒప్పందం చేసుకున్నామని, ఇది ఫ్యాకల్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.