Share News

శొంఠ్యాం కొండకు స్కెచ్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:00 AM

ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామంలో ప్రభుత్వ భూములు కొట్టేయడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బ్రోకర్లు అంతా ముఠాగా ఏర్పడ్డారు.

శొంఠ్యాం కొండకు స్కెచ్‌

హద్దులేసి పంచుకున్నారు

అన్ని పార్టీల నేతలు, బ్రోకర్లు ఏకం

వీఎంఆర్‌డీఏ ల్యాండ్‌ పూలింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఆక్రమణదారులు/సాగుదారులుగా ఉన్నట్టు కలరింగ్‌

రెవెన్యూ శాఖ సర్వే సమయంలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి బినామీ పేర్లు నమోదు

ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదులు

విశాఖపట్నం/ఆనందపురం,జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామంలో ప్రభుత్వ భూములు కొట్టేయడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బ్రోకర్లు అంతా ముఠాగా ఏర్పడ్డారు. ఎవరెవరు ఎంతెంత కబ్జా చేద్దామనుకున్నారో...రంగులతో రాళ్లపై హద్దులు వేసుకున్నారు. ఈ ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీఎంఆర్‌డీఏ రెండో దశలో శొంఠ్యాంలోని సర్వే నంబరు 347లో గల 452 ఎకరాల్లో కొంత మేర సేకరించనున్నదనే సమాచారాన్ని ముందుగానే కొందరు నేతల ద్వారా తెలుసుకున్నారు. అక్కడ ఆక్రమణదారులు/సాగుదారులుగా పేర్లు నమోదు చేయించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

శొంఠ్యాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 347లో 452 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వానికి చెందిన కొండ ఉంది. కొండ అంచున శొంఠ్యాం, మిందివానిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 20 నుంచి 30 మంది రైతుల ఆధీనంలో రమారమి 50 ఎకరాలు ఉంది. దీంట్లో జీడితోటలు, ఇతర రకాల చెట్లు పెంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఇదే ప్రాంతంలో మరికొందరు రైతులకు డీపట్టాలు ఉన్నాయి. ఈ సర్వేనంబరులో ప్రభుత్వ అవసరాలు/వీఎంఆర్‌డీఏ కోసం ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించి మూడు నెలల క్రితం ఫారం-1 నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు పెద్దలు (కూటమి పార్టీల నేతలు కొందరు, మరో కీలకనేత, గత ప్రభుత్వంలో భూములు కొనుగోలు చేసి దళారీ) రంగంలోకి దిగారు. ఫాం-1 నోటిఫికేషన్‌ జారీ తరువాత రెవెన్యూ శాఖ సర్వే చేసి భూమిలో రైతుల వివరాలు అంటే డీపట్టాభూములు, ఆక్రమణదారులు, అనుభవదారుల వివరాలు నమోదుచేసి ఆ తరువాత గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది.

అయితే స్థానికంగా ఉన్న కూటమి, వైసీపీ నేతలతోపాటు మరికొందరు ఒక ముఠాగా ఏర్పడి సర్వేనంబరు 347లో కొండపై సుమారు 100 ఎకరాలకు స్కెచ్‌ వేశారు. కొండవాలు, పైన జీడితోటలు వేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి ఆధీనంలో ఉన్న విస్తీర్ణంలో సగమే రికార్డుల్లో ఉందని పేర్కొంటూ మిగిలిన సగం తమ బినామీల పేర్లతో ఒక జాబితా తయారుచేశారు. అదే సమయంలో కొండపైన పొదలు తొలగించారు. రాళ్లపై రంగులు వేసి హద్దులు వేసుకున్నారు. అయితే గ్రామానికి చెందిన కొందరు తాజాగా కొండపైకి వెళ్లి రంగులతో రాళ్లపై హద్దులు వేసుకున్న ఫొటోలు తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల రెవెన్యూ శాఖ సిబ్బంది, సర్వేయర్లు కలిసి సర్వే నంబరు 347లో భూముల పరిశీలనకు వెళ్లారు. వారిపై ఒత్తిడి తీసుకువచ్చి కొండపై హద్దులు వేసిన భూమి తమదేనని జాబితాలో చేర్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలాకాలం నుంచి సర్వేనంబరు 347లో తోటలు సాగుచేస్తున్న రైతుల్లో కొందరి పేర్లు తప్పించి, బినామీ పేర్లను జాబితాలో చేర్చారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రామ సభ వాయిదా వేసింది. శొంఠ్యాంలో సర్వే నంబరు 347లో భూముల కబ్జాకు ముఠా చేస్తున్న అక్రమాలపై గ్రామానికి చెందిన కొందరు తాజాగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. శొంఠ్యాంకు చెందిన నాయకుడు ఒకరు కూటమిలో ఒక పార్టీకి చెందిన మండల నేత ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండలంలో ఇద్దరు మాజీ సర్పంచులు, పలు వ్యాపారాలు నిర్వహించే బ్రోకర్లు , మాజీ వలంటీర్‌, గత ప్రభుత్వంలో మద్యం దుకాణంలో పనిచేసిన ఉద్యోగి..ఇలా పలువురు ఈ దందాలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 01:00 AM