అనారోగ్యంతో ఆరో తరగతి విద్యార్థిని మృతి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:19 PM
మండలంలోని కిల్లోగుడ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మజ్జి కావ్య తేజశ్విని (11) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది.
డుంబ్రిగుడ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కిల్లోగుడ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మజ్జి కావ్య తేజశ్విని (11) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని కోలపుట్టు పంచాయతీ చంపగుడ గ్రామానికి చెందిన మజ్జి కావ్య తేజశ్విని(11) రెండు వారాల క్రితం కిల్లోగుడ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఆరో తరగతిలో నూతనంగా చేరింది. పది రోజులుపాటు వసతిగృహంలో ఉన్న చిన్నారికి జ్వరం రావడంతో ఈనెల 11వ తేదీన తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. అదేరోజు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో బాలికకు ఇంటికి తీసుకువెళ్లారు. మరోసారి మంగళవారం జ్వరం రావడంతో అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పర్యవేక్షణలో ఆరోగ్యం కుదటపడకపోవడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వైద్యులు పరీక్షించి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. బాలికను అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యలో చోడవరం వద్ద గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతి చెందిందని బాధిత తండ్రి దామోదర్ భోరుమని విలపించారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి శుక్రవారం అంత్యక్రియలు జరిపారు. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే బాలిక జ్వరం బారిన పడి మృతి చెందడంపై కుటుంబీకులు జీర్ణించుకులేకపోతున్నారు.