సీలేరు కాంప్లెక్సులో ఆరు మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:27 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మూడు జల విద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు ఆరు మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు.
పొల్లూరు, సీలేరు, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాల్లో అన్ని యూనిట్లు అందుబాటులో..
గోదావరి డెల్టాకు నీరు విడుదల చేస్తున్న తరుణంలో విద్యుదుత్పత్తిని పెంచే దిశగా చర్యలు
సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు
సీలేరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మూడు జల విద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు ఆరు మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరి డెల్టా రబీ పంటలకు ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు, సీలేరు, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాల ద్వారా గ్రిడ్ అధికారుల ఆదేశాల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. సీలేరు కాంప్లెక్సులో ప్రస్తుతం జరుగుతున్న విద్యుదుత్పత్తి కంటే పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని, దీనికి గ్రిడ్ అధికారుల నుంచి ఆదేశాలు రావలసి ఉందని ఆయన చెప్పారు. సీలేరు కాంప్లెక్సులో ప్రస్తుతం డొంకరాయిలో మినహా పొల్లూరు, సీలేరు, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాల్లో యూనిట్లు అన్నీ అందుబాటులోనే ఉన్నాయన్నారు. డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో యూనిట్ ఓవర్‌హాలింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందేనన్నారు. సీలేరులో రోజుకు 1.5 మిలియన్ యూనిట్లు, పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 3.5 మిలియన్ యూనిట్లు, మాచ్‌ఖండ్‌లో ఒక మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నామని చెప్పారు. గోదావరి డెల్టాకు ఈ నెలాఖరు వరకు నీటి విడుదలను కొనసాగిస్తామని, గోదావరి డెల్టాకు నీటి విడుదల నేపథ్యంలో బలిమెల జలాశయం నుంచి మన వాటాగా 5 వేల క్యూసెక్కుల వరకు నీటిని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
నిర్దేశించిన సమయానికి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
సీలేరు జల విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది (2025- 2026 ఆర్థిక సంవత్సరానికి) సెంట్రల్ విద్యుత్ అథారిటీ 477 మిలియన్ యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించిందని ఏపీ జెన్‌కో సీలేరు జల విద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్ ఒకటి నుంచి 2026 ఫిబ్రవరి 3 నాటికి 341 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేశామని, ఇంకా 136 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నిర్దేశించిన సమయానికి విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, జల విద్యుత్ కేంద్రంలో 120 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లు వినియోగంలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.