సర్ గడువు ముంచుకొస్తుంది
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:01 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 97.45 శాతం మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.
జిల్లాలో ఇప్పటివరకూ 97.45 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ
అవి పూరించి సచివాలయాల్లో అందజేయాలని చెబుతున్న బీఎల్‌వోలు
ఒక పట్టాన తిరిగిరావడం లేదంటున్న సిబ్బంది
ఇప్పటివరకూ కేవలం 28.64 శాతం ఫారాలే డిజిట్ లైజేషన్
మరో 11 రోజులు మాత్రమే సమయం
రేషన్ డీలర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆర్పీలను భాగస్వాములను చేయాలని అధికారుల నిర్ణయం
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 97.45 శాతం మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. అయితే అవి తిరిగి బీఎల్‌వోలు తీసుకుని ఆన్‌లైన్‌లో డిజిట్ లైజేషన్ చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చినంత సులువుగా పూరించినవి వెనక్కి రావడం లేదు. మొత్తం ఫారాలు ఈనెల 14వ తేదీ సాయంత్రంలోగా డిజిట్ లైజేషన్చేయాల్సి ఉంది.
జిల్లాలో 20,23,009 మంది ఓటర్లకుగాను 19,71,420 మందికి (97.45 శాతం) ఫారాలు అందజేయగా, ఇంతవరకు 5,79,474 (28.64 శాతం) ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ అయ్యాయి. ఎక్కువమంది ఫారాలు తీసుకుని ఇంట్లో పెట్టేశారు. బీఎల్‌వో వస్తే అన్ని వివరాలు నమోదుచేసి ఇద్దామనుకుంటున్నారు. ఇళ్ల వద్ద లేని వారికి సంబంధించిన ఫారాలను పొరుగింట్లో లేదా అపార్టుమెంట్ అయితే వాచ్‌మన్‌కు అందజేశారు. ఇలా అందజేసిన ఫారాలు ఆయా వ్యక్తులు తీసుకున్నారా లేదా అనేది తెలియడం లేదు. అలాగే ఓటరు జాబితాలో ఉన్న కొందరి ఇంటి అడ్రస్‌లు గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరికొందరు ఇళ్లు మారడంతో వారెక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని అపార్టుమెంట్‌లలో ఫారాలు పంపిణీకి అనుమతించలేదనే వాదన ఉంది.
ఇదిలావుండగా ఫారాలు ఇవ్వడం వరకే తమ బాధ్యత అన్నట్టు కొందరు బీఎల్‌వోలు వ్యవహరిస్తున్నారు. ఫారాల్లో అన్ని వివరాలు నమోదుచేసి సచివాలయానికి తీసుకువెళ్లి ఇవ్వాలని చెబుతున్నారు. మరోవైపు ఫారాలను బీఎల్‌వోలే ఆయా ఇళ్లకు వెళ్లి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కాగా డిజిటలైజేషన్‌కు మరో 11 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గడువులోగా లక్ష్యం చేరుకోవడానికి ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు సమర్పించే ప్రక్రియలో రేషన్ డీలర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, స్వయం సంఘాలను పర్యవేక్షించే ఆర్పీలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు రేషన్ డిపోల్లో బియ్యం పంపిణీ చేస్తున్నారు. సరుకుల కోసం వచ్చిన ప్రతి కార్డుదారుడికి ఎన్యుమరేషన్ ఫారం అందిందా?...అని తెలుసుకోవడంతో పాటు వెంటనే ఫారంలో అన్ని వివరాలు నమోదుచేసి తిరిగి బీఎల్‌వోకు అందజేయాలని చెప్పాల్సిందిగా డీలర్‌లకు పౌర సరఫరాల అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల తల్లులకు టీచర్లతో చెప్పించనున్నారు. అదేవిధంగా నగరంలో వందలాది స్వయంశక్తి సంఘాల్లో వేలాది మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యురాలితో అక్కడ ఉన్న ఆర్పీకి ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి అందజేసేలా చూడాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
4, 5 తేదీల్లో సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ఈనెల 4,5 తేదీల్లో అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఓటర్లు పూర్తిచేసిన ఎన్యుమరేషన్ ఫారాలను సంబంధిత బీఎల్‌వో లేదా 4, 5 తేదీల్లో సచివాలయానికి అందజేయాలన్నారు. ఓటరు తీసుకున్న ఫారాన్ని నింపి బీఎల్‌వోకు సమర్పించకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. అందకే రెండురోజులపాటు నిర్వహించే క్యాంపులను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా సర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం నిర్వహించిన వీడియోకాన్పరెన్స్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు.