Share News

సర్‌ ప్రత్యేక డ్రైవ్‌ సక్సెస్‌

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:46 AM

ఓటరు జాబితా సమగ్ర సవరణ-2026లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ విజయవంతంగా సాగింది.

సర్‌ ప్రత్యేక డ్రైవ్‌ సక్సెస్‌

విజయవంతంగా సాగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ

జిల్లాలో 80.94 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ

ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

ఓటరు జాబితా సమగ్ర సవరణ-2026లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ విజయవంతంగా సాగింది. బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణతో పాటు డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,23,009 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ 16,37,424 ఫారాలను పంపిణీ చేశారు. వీటిలో 75,427 ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది.

ప్రత్యేక డ్రైవ్‌ సందర్భంగా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ విశాఖ తూర్పు నియోజకవర్గం లాసన్స్‌బే కాలనీ 132వ పోలింగ్‌ స్టేషన్‌, పెదగంట్యాడలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ప్రక్రియను సమీక్షించారు. జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ళ విద్యాధరి పెదగంట్యాడ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రక్రియను పరిశీలించారు. పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట, గాజువాక నియోజకవర్గంలోని అక్కిరెడ్డిపాలెం, భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్‌లోని అడవివరం జంక్షన్‌, ఆనందపురం మండలంలోని పలు పోలింగ్‌ కేంద్రాలు, దక్షిణ నియోజకవర్గంలోని బుక్కవీధి ప్రాంతాలను ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు సందర్శించారు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని బీఎల్వోలకు సూచించారు.

ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీలో 86.12 శాతంతో జిల్లాలో దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. పెందుర్తి నియోజకవర్గం 84.9 శాతం, భీమిలి 81.14 శాతం, గాజువాక 79.74 శాతం, విశాఖ పశ్చిమ 76.19 శాతంతో పురోగతి సాధించాయి. డిజిటలైజేషన్‌లో విశాఖ ఉత్తర నియోజకవర్గం 5.9 శాతంతో జిల్లాలో మొదటి స్థానం దక్కించుకోగా, పశ్చిమ 3.85 శాతం, గాజువాక 3.75 శాతం, పెందుర్తి 3.74 శాతం నమోదు చేశాయి. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, నిర్ణీతగడువులో ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

Updated Date - Jun 27 , 2026 | 12:46 AM