సవాల్‌గా మారిన సర్ ప్రక్రియ
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:08 AM
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ బీఎల్‌వోలు, అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. సాంకేతిక సమస్యలు, బూత్ పరిధి ఓటర్లు వేర్వేరు గ్రామాల్లో ఉండడం, పేర్లలో అక్షర దోషాలు, ఇంటర్నెట్ సమస్యతో ఈ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. దీంతో జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతూ సర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి పురోగతి కనిపించడం లేదు.
- సాంకేతిక సమస్యలు, వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లు, అక్షర దోషాలు
- ముందుకు సాగని సవరణ కార్యక్రమం
- రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో జిల్లా
- ఉరుకులు, పరుగులు పెడుతున్నా కనిపించని పురోగతి
చింతపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ బీఎల్‌వోలు, అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. సాంకేతిక సమస్యలు, బూత్ పరిధి ఓటర్లు వేర్వేరు గ్రామాల్లో ఉండడం, పేర్లలో అక్షర దోషాలు, ఇంటర్నెట్ సమస్యతో ఈ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. దీంతో జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతూ సర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి పురోగతి కనిపించడం లేదు.
జిల్లాలో పాడేరు నియోజకవర్గంలో 318 పోలింగ్ బూత్‌ల పరిధిలో 2,51,087 మంది, అరకు నియోజక వర్గంలో 306 పోలింగ్ బూత్‌ల పరిధిలో 2,48,665 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం దోషరహితంగా, కచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ మేరకు జూన్ 15న బూత్ స్థాయిలో సవరణ కార్యక్రమాన్ని బీఎల్‌వోలు ప్రారంభించారు. ఈ నెల 14తో ఈ ప్రక్రియ ముగియనున్నది. జిల్లా వ్యాప్తంగా బీఎల్‌వోలు 80 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారు. ఆదివారం నాటికి 44.13 ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. రాష్ట్రంలో ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేయడంలో జిల్లా అట్టడుగు స్థానంలో ఉండడంతో అధికారులు రాత్రి, పగలు తేడా లేకుండా సవరణ కార్యక్రమం వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సాంకేతిక సమస్యతో ముందుకు సాగని సవరణ
గిరిజన ప్రాంతంలో సాంకేతిక సమస్యల కారణంగా సర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం బీఎల్‌వోలు 2002 ఓటరు జాబితాతో సరిపోలుస్తూ సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఓటరు గృహానికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, సమగ్ర సమాచారాన్ని తీసుకుని ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఒక బూత్ పరిధిలో ఉన్న ఓటర్లు సుమారు 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఉంటున్నారు. బీఎల్‌వోలు ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వెళ్లేందుకే అధిక సమయం పడుతుంది. అలాగే ఓటర్ల పేర్లలో అక్షర దోషాలు, వయస్సులో తేడాలు అధికంగా ఉన్నాయి. పీవీటీజీ ఓటర్లను 2002 జాబితాతో సరిపోల్చడంపై బీఎల్‌వోలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక ఓటరుకి ఓటరు జాబితాలో ఒక పేరు, గ్రామంలో పిలుచుకునే పేరు వేరు, ఆధార్ కార్డులో వేరే పేరు ఉంటుంది. దీంతో ఓటరు జాబితాలో ఉన్న పేరు ఆధారంగా గ్రామానికి వెళ్లి బీఎల్‌వో వాకబు చేస్తే అతని ఆచూకీ తెలియదని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఒక ఓటరును గుర్తించి ఎన్యుమరేషన్ ఫారం అందజేసేందుకు నాలుగైదు సార్లు గ్రామంలో బీఎల్‌వోలు తిరగాల్సి వస్తుంది. నూతన ఓటర్ల వివరాలు తీసుకున్నప్పటికి డిజిటలైజేషన్ చేసే సమయంలో 2002 జాబితాలో రక్తసంబంధీకుల వివరాలతో సరిపోల్చడం కష్టతరంగా మారింది. మైదాన ప్రాంతాల్లో ఓటర్లు బీఎల్‌వోలు వద్దకు వచ్చి వారే ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకుని సమగ్ర సమాచారం అందజేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఈ పరిస్థితిలేదు. ప్రస్తుతం గిరిజన ప్రజలు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. గిరిజనులు ఉదయాన్నే పొలాలకు వెళ్లిపోయి, మధ్యాహ్నం, సాయంత్రం తిరిగి వస్తున్నారు. దీంతో బీఎల్‌వోలు ఓటర్ల గృహాలను పలుమార్లు సందర్శించాల్సి వస్తున్నది. జిల్లాలో కేవలం 5-10శాతం ఓటర్లు మాత్రమే స్వచ్ఛందంగా బీఎల్‌వోల వద్దకు వచ్చి సమాచారాన్ని అందజేస్తున్నారు. 90 శాతం ఓటర్ల వద్దకు బీఎల్‌వోలు కచ్చితంగా రెండు, మూడు సార్లు వెళ్లి అవసరమైన సమాచారం తీసుకోవాల్సి వస్తున్నది.
జిల్లా అధికారులందరికీ సర్ విధులు
సర్ ప్రక్రియలో జిల్లా వెనుకబడి ఉండడంతో కలెక్టర్ నిషాంతి జిల్లా అధికారులకు ఆ విధులను అప్పగించారు. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్, ఎంఈవోల పర్యవేక్షణలో బీఎల్‌వోలు సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలకు సహాయకులుగా వెలుగు వీవోఏ, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆర్‌వోఎఫ్‌వో సర్వేయర్లు, కాఫీ లైజన్ వర్కర్లను నియమించారు. దీనికి తోడు ఒక్కొక్క మండలానికి ఆరుగురు వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ నియమించారు. ఓ వైపు కలెక్టర్, జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులు, బీఎల్‌వోలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు, బీఎల్‌వోలు, క్షేత్రస్థాయి ఉద్యోగులు సెలవు రోజుల్లోనూ రాత్రి 12 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. సర్ ప్రక్రియ గడువు సమయం దగ్గరపడుతుంది. దీంతో అధికారులు, ఉద్యోగులు ప్రతి రోజు టెన్షన్‌తో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అధికారులు, బీఎల్‌వోలు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను గుర్తించి ఎన్నికల సంఘం గడువు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.