ఎస్‌ఐఆర్ ప్రక్రియ మరింత వేగవంతం
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:01 PM
ఓటరు జాబితాల నవీకరణలలో భాగంగా చేపడుతున్న స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను మరింత వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌బీ.జోషి ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌బీ.జోషి ఆదేశం
ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్ నిషాంతి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
పాడేరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల నవీకరణలలో భాగంగా చేపడుతున్న స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను మరింత వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌బీ.జోషి ఆదేశించారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియపై సమీక్షించేందుకు శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల మేరకు మాత్రమే ఓటరు జాబితాల సవరణ జరగాలని, మృతులు, రెండుచోట్ల ఓట్లున్న వారి పేర్లను ఒకటి, రెండు మార్లు పరిశీలించిన తర్వాత మాత్రమే జాబితాలో తొలగించాలన్నారు. అర్హులైన అందరికీ ఓటు హక్కు ఉండాలని, వారికి ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగకూడదన్నారు. ఈక్రమంలో జిల్లా స్థాయి అధికారుల నుంచి బూత్ స్థాయి అధికారుల వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని ఎస్‌బీ.జోషి పేర్కొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్‌పై జిల్లాలో చేపడుతున్న చర్యలపై జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా జిల్లాలోని 11 మండలాల్లో భౌగోళిక పరిస్థితులు, ప్రజల అక్షరాస్యత, రోడ్డు, కమ్యూనికేషన్ సమస్యలు, భాష, సామాజిక ఇబ్బందులను కలెక్టర్ వివరించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎటువంటి ఖాళీలు లేకుండా మొత్తం 624 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామని, వారిని పర్యవేక్షించేందుకు 57 మంది సూపర్‌వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు నిరంతరం ఎస్‌ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఓటరు జాబితాల సవరణపై నిబంధనల మేరకు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటిని సందర్శిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ నిషాంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఆర్డీవో కె.భుజంగరావు, మండల ప్రత్యేకాధికారులు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.