‘సర్’ ప్రారంభం
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:59 AM
జిల్లాలో ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ఎన్యూమరేషన్ సర్వే సోమవారం ప్రారంభమైంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు శ్రీకారం
ఇంటింటికీ వెళ్లిన బీఎల్వోలు
42 వేలమంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ఎన్యూమరేషన్ సర్వే సోమవారం ప్రారంభమైంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోని 1,980 పోలింగ్ బూత్‌ల పరిధిలో బూత్‌లెవెల్ అధికారులు (బీఎల్‌వోలు) సోమవారం 42 వేలమంది ఓటర్ల ఇళ్లకు వెళ్ల్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. వివరాలు నమోదుకు సూచనలిచ్చారు. జిల్లాలో 20.23 లక్షలమంది ఓటర్లున్నారు. ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ వచ్చేనెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఫారాల్లో వివరాలు నమోదుచేసి వచ్చేనెల 14లోగా వారికి తిరిగి అందజేయాలి. ముఖ్యంగా 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని చేస్తున్న ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఓటరు పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా యంత్రాంగం కోరింది.
చేపలవేటకు సై!
తెల్లవారుజామునే సంద్రంలోకి బోట్లు
మధ్యాహ్నానికే తీరానికి చేరిన వైనం
భారీ వర్షాలు కురిస్తేనే వేట సాగుతుందంటున్న మత్స్యకారులు
విశాఖపట్నం, జూన్ 15 (ఆంద్రజ్యోతి): సముద్రంలో చేపలవేట ఆదివారం అర్ధరాత్రి మొదలైంది. రెండు నెలల విరామం తరువాత గంగమ్మ పూజలు చేసి మత్స్యకారులు సముద్రంలో వేటకు బయలుదేరారు. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంకా పెట్టుబడుల సమకూరని వారు హార్బర్‌లోనే బోట్లను ఉంచేశారు. సగం బోట్లు వేటకు వెళ్లాయి. ఇంజన్ పడవలు వేటకు వెళ్లి మధ్యాహ్నానికే తిరిగి తీరానికి చేరాయి. వారికి చిన్న రొయ్యలు, చేపలు, పీతలు లభించాయి. ఆరు కిలోల రొయ్యల బుట్టను రూ.2వేలకు విక్రయించారు. ఒకటి రెండు వర్షాలు కురిస్తే వేట బాగా సాగుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.
బినామీల దందాపై విజిలెన్స్
శొంఠ్యాం కొండ ఆక్రమణలపై చర్యలు
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం శొంఠ్యాం సర్వేనంబరు 347లో 452 ఎకరాల కొండపై 100 ఎకరాలకుపైగా కొందరు స్థానిక నాయకులు ఆక్రమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ‘శొంఠ్యాం కొండకు స్కెచ్’ శీర్షికన ఈనెల నాలుగోతేదీన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై విజిలెన్స్ అధికారులు స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన అధికారి శొంఠ్యాం గ్రామాన్ని సందర్శించి స్థానికుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీకి చెందిన మండలస్థాయి నాయకుడు, వైసీపీ నేత, మాజీ సైనికుడు, మాజీ వలంటీర్, ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసిన వ్యక్తి, డాక్యుమెంటరీ రైటర్‌తోపాటు మరికొందరు ముఠాగా ఏర్పడి కొండపై రంగులతో హద్దులు వేసిన వైనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై గ్రామస్థులు విజిలెన్స్ అఽధికారికి వివరించారు. ల్యాండ్ పూలింగ్ కోసం కొండపై రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో హద్దులుగా రంగులు వేయలేదని సమాచారం ఇచ్చారు. కొండ వాలులో ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణంలో తోటలు సాగుచేస్తున్నారనేదానిపై మాత్రమే సర్వేచేసి జాబితా సిద్ధంచేశారని తెలిపారు. రెవెన్యూ అధికారుల సర్వేకు ముందుగా గ్రామానికి చెందిన ముఠా బినామీలతో జాబితాను రెవెన్యూసర్వే సిబ్బందికి అందజేశారని తెలిసింది.
కేజీహెచ్‌లో వైద్యుడి వేధింపులపై విచారణ
ముగ్గురు వైద్యులతో కమిటీని నియమించిన ఏఎంసీ ప్రిన్సిపాల్
- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో వైద్య విద్యార్థినులను వేధిస్తున్న వైద్యుడిపై విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ లో శనివారం ‘కేజీహెచ్‌లో పీజీ విద్యార్థినులకు వేధింపు లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. వేధింపులకు గురవుతున్న వైద్య విద్యార్థినులు తాజాగా ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవికి మెయిల్‌లో ఫిర్యా దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ మొత్తం వ్యవహా రంపై విచారణకు ఆదేశించారు. ముగ్గురు వైద్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సోమవారం జనర ల్ సర్జరీ విభాగానికి చెందిన పీజీలను విచారించింది. పురుష పీజీలను కూడా విచారణకు పిలిపించిన కమిటీ కీలక అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. సదరు వైద్యుడి వ్యవహారశైలితోపాటు వేధింపులకు సంబంధించిన కీలక వివరాలపై ఆరా తీసినట్టు తెలిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక్కో వైద్య విద్యార్థినిని పిలిచి వివరాలను ఈ బృందం సేకరించింది. మంగళవారం కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడ లేదు.
ప్రత్యేక రైళ్లు పొడిగింపు
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ, షాలిమార్, బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నామని దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వో బాలాజీ కిరణ్ తెలిపారు. విశాఖ-షాలిమార్ రైలు (08508) జూలై 7 నుంచి సెప్టెంబరు 29 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11.20 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు షాలిమార్ చేరుతుంది. షాలిమార్-విశాఖ రైలు (08507) జూలై 8 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి అదేరోజు రాత్రి 8.50 గంటలకు విశాఖ చేరుతుంది.
విశాఖ-బెంగళూరు రైలు (08581) జూలై 3 నుంచి సెప్టెంబరు 25 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరు చేరుతుంది. బెంగళూరు-విశాఖ రైలు (08582) జూలై 4 నుంచి సెప్టెంబరు 26 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది.