Share News

వార్డుల విభజనపై సింగిల్‌ జడ్జి

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:00 AM

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

వార్డుల విభజనపై సింగిల్‌ జడ్జి

మధ్యంతర ఉత్తర్వులు రద్దు

పునర్విభజన ప్రక్రియతో పిటిషనర్ల చట్టబద్ధమైన హక్కులకు భంగం కలగదు

సీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టీకరణ

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. వార్డుల పునర్విభజన కారణంగా పిటిషనర్ల చట్టబద్ధమైన హక్కులకు ఎలాంటి భంగం కలగడం లేదని గుర్తుచేసింది. కోర్టు ముందు ఉన్న రికార్డులను పరిశీలిస్తే ఈ ఏడాది మే 17న జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై పిటిషనర్లు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టమవుతుందని పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు వారాల్లో వార్డుల పునర్విభజనకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం లేదని, ఆగస్టు 11న సింగిల్‌ జడ్జి వద్ద రిట్‌ పిటిషన్లలో తుది వాదనలు వినిపిస్తామని ఏజీ చెబుతున్నారని గుర్తుచేసింది. సాధ్యమైనంత త్వరగా వ్యాజ్యంపై తుది నిర్ణయం వెల్లడించాలని సింగిల్‌ జడ్జిని కోరింది. అలాగే సింగిల్‌ జడ్జి వద్ద విచారణపై ఎలాంటి ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో అప్పీల్‌ లోతుల్లోకి వెళ్లి మెరిట్స్‌పై తాము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.

విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వార్డుల సంఖ్యను పెంచుతూ ఈ ఏడాది మార్చి 24న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 65 ఆధారంగా మే 17న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ నరసింహ ప్రతాప్‌ భగవతులు, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌లో జనాభా లెక్కలు ప్రారంభమైనందున కేంద్ర సెన్సెస్‌ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం ఈ సమయంలో పరిపాలనా సరిహద్దులు మార్చడంపై నిషేధం ఉందని, జీవీఎంసీ వార్డులను విభజించడానికి వీల్లేదన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన సింగిల్‌ జడ్జి ప్రాథమిక నోటిఫికేషన్‌ ఆధారంగా వార్డుల పునర్విభజన ప్రక్రియపై ముందుకువెళ్లొద్దని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశిస్తూ మే 29న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీవీఎంసీ కమిషనర్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ...వార్డుల పెంపు విషయంలో జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన మరికొన్ని వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ప్రభుత్వ చర్య కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండానే ఇదే కోర్టులోని మరో సింగిల్‌ జడ్జి ప్రాథమిక నోటిఫికేషన్‌ ఆధారంగా వార్డుల పునర్విభజన ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ కారణంగా జీవీఎంసీ భౌగోళిక సరిహద్దులు మారడం లేదు. కొత్తగా జీవీఎంసీలో ఏ గ్రామ పంచాయతీని, మునిసిపాలిటీని చేర్చడం కానీ, తొలగించడం గానీ చేయడం లేదు. సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు వార్డుల పునర్విభజన మాత్రమే చేస్తున్నాం. సెన్సెస్‌ నిబంధనల ప్రకారం జనాభా లెక్కలు పూర్తి అయ్యేవరకు జిల్లాలు, పట్టణాలు, తాలూకాలు సరిహద్దులు మార్చడానికి వీల్లేదు. వార్డుల పునర్విభజన సరిహద్దులు మార్పు కిందకు రావు. గత ఏడాది ఆగస్టు 13న సెన్సెస్‌ కమిషనర్‌ ఇచ్చిన కార్యనిర్వాహక సూచనలు మునిసిపల్‌ పాలన, ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగ, చట్టపరమైన అధికారాలపై పైచేయి సాధించలేవు. వార్డుల పునర్విభజన అడ్డుకుంటే మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై పిటిషనర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. వార్డుల పునర్విభజన వల్ల పిటిషనర్ల చట్టబద్ధమైన హక్కులకు ఎలాంటి భంగం కలగడం లేదు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయండి’ అని వాదించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ కౌంటర్‌ దాఖలు చేసేందుకు సింగిల్‌ జడ్జి వద్ద సమయం కోరి రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రస్తుత అప్పీల్‌కు విచారణార్హత లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మునిసిపాలిటీలు, రెవెన్యూ గ్రామాలు, సబ్‌ డివిజన్లు, జిల్లాల సరిహద్దులో మార్పులు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను 2025 డిసెంబర్‌ 31 నాటికి ఆమోదించి, అమల్లోకి తీసుకురావాలని కేంద్ర రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సెస్‌ కమిషనర్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేస్తూ 2025 జూన్‌ 27న సర్క్యులర్‌ ఇచ్చారని, కేంద్ర సెన్సెస్‌ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం వార్డుల పునర్విభజన సైతం జరపడానికి వీల్లేదన్నారు. అప్పీల్‌ను కొట్టివేయాలని కోరారు.

ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...‘వార్డుల సంఖ్యను పెంచడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను విచారించిన సింగిల్‌ జడ్జి వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వంపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వార్డుల సంఖ్య పెంపు, వాటి పునర్విభజన కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సింగిల్‌ జడ్జి నిరాకరించారు. ఆ ఉత్తర్వులకు భిన్నంగా హైకోర్టులోని మరో సింగిల్‌ జడ్జి ప్రస్తుత రిట్‌ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. రాబోయే మూడు, నాలుగు వారాల్లో వార్డుల పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం లేదని, ఆగస్టు 11న సింగిల్‌ జడ్జి వద్ద రిట్‌ పిటిషన్లలో తుది వాదనలు వినిపిస్తామని ఏజీ చెబుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.


మారని ఏయూ తీరు

మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్న

కళాశాలల్లోనే దూరవిద్య ప్రాక్టికల్స్‌

చర్యలకు తీసుకోవడానికి బదులు

మళ్లీ అవకాశం కల్పించడంపై అనుమానాలు

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

ఇటీవల నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య పరీక్షల్లో కొన్ని చోట్ల మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. విజయనగరం జిల్లా గజపతినగరం, అనకాపల్లి జిల్లా చోడవరం కళాశాలల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నట్టు గుర్తించి విద్యార్థులను డిబార్‌ చేశారు. సదరు కాలేజీలపైనా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. అయితే, మళ్లీ అదే కాలేజీలకు పరీక్షలు నిర్వహించే అవకాశం కల్పించడం అనుమానాలకు తావిస్తోంది.

దూరవిద్య కోర్సుల్లో చేరిన కొందరు విద్యార్థులకు ఈ నెల పది, వచ్చే నెల 15 నుంచి ప్రాక్టికల్‌ కమ్‌ పర్సనల్‌ కాంట్రాక్ట్‌ ప్రోగ్రామ్‌, ఇయర్‌ ఎండ్‌ ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నెల పదో తేదీ నుంచి నెలాఖరు వరకు 2025 విద్యా సంవత్సరంలో చేరిన ఫస్ట్‌ ఇయర్‌ బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు, బీఎస్సీ సెకండ్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు, అలాగే, వచ్చే నెల 15 నుంచి నెలాఖరు వరకు బీఎస్సీ ఐదో సెమిస్టర్‌, 2024లో విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ కామ్‌ పర్సనల్‌ కాంట్రాక్ట్‌ ప్రోగ్రామ్‌ తరగతులు, ఇయర్‌ ఎండ్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం కొన్ని పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. అందులో కొద్దిరోజుల కిందట మాస్‌ కాపీయింగ్‌ జరిగిన కళాశాలలు కూడా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్టు గుర్తించిన కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకుని పరీక్షలు, ప్రాక్టికల్స్‌ నిర్వహణ నుంచి తప్పించారు. కానీ, ఇప్పుడు మళ్లీ అటువంటి కాలేజీలకు అవకాశం కల్పించడం వెనుక ఉన్నత స్థాయి లాబీయింగ్‌ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని వైస్‌ చాన్సలర్‌ దృష్టికి కొందరు తీసుకువెళ్లినట్టు తెలిసింది.

Updated Date - Aug 09 , 2026 | 01:00 AM