Share News

భక్తజనసంద్రమైన సింహగిరి

ABN , Publish Date - May 10 , 2026 | 12:24 AM

సింహగిరి శనివారం భక్తజనసంద్రమైంది.

భక్తజనసంద్రమైన సింహగిరి

అప్పన్న దర్శనానికి బారులుతీరిన జనం

సింహాచలం, మే 9 (ఆంధ్రజ్యోతి):

సింహగిరి శనివారం భక్తజనసంద్రమైంది. రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడం, శుక్రవారం రాత్రి, శనివారం వేకువజామున ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేసుకున్న నవ వధూవరులు, వారి కుటుంబ సభ్యులు అప్పన్న దర్శనానికి తరలిరావడంతో కొండ కిటకిటలాడింది. కేశఖండనశాల, గంగధార, ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద, అన్న ప్రసాద భవనం వద్ద భక్తుల సందడి కనిపించింది. దేవస్థానం ఈఓ జల్లేపల్లి వెంకటరావు స్వయంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరణకు నడుం బిగించి, సిబ్బందికి సమయానికి తగ్గట్టు సూచనలు ఇచ్చారు.


స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సమాయత్తం

అధికారులు, క్లాప్‌ వాహనాల డ్రైవర్లతో

జీవీఎంసీ కమిషనర్‌ సమావేశాలు

విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి):

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2026కు జీవీఎంసీ సమాయత్తం అవుతోంది. కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ రెండు రోజుల క్రితం ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేసి పారిశుధ్యం మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రోడ్లపై చెత్త కనిపించకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. తాజాగా క్లాప్‌ వాహనాల పనితీరుపై కూడా కమిషనర్‌ దృష్టిసారించారు. క్లాప్‌ వాహనాల డ్రైవర్లు, సూపర్‌వైజర్లతో శుక్రవారం సమావేశం ఏర్పాటుచేశారు. క్లాప్‌ వాహనాలు తమ పరిధిలో మొక్కుబడిగా తిరిగి వచ్చేస్తున్నాయని, చెత్త ఇవ్వని ఇళ్లకు సిబ్బంది వెళ్లి అడగడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇకపై వాహనాలు విధిగా తమకు కేటాయించిన ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను వాహనం వద్దకు తెచ్చి ఇచ్చేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలా చేయడం ద్వారా ప్రజలు చెత్తను రోడ్లపైన, గెడ్డల్లోనూ వేయకుండా నిలువరించడానికి అవకాశం ఉంటుందని క్లాప్‌ వాహనాల సిబ్బందికి వివరించారు. పారిశుధ్య నిర్వహణ మెరుగుపడితే స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో నగరానికి మంచి ర్యాంకు వచ్చేందుకు అవకాశం కలుగుతుందని, అందుకు అందరూ తమ వంతు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కోరారు.


కొండెక్కిన కోడి

కిలో స్కిన్‌ లెస్‌ రూ.330

ఎండలు, వడగాడ్పులతో తగ్గిన కోళ్ల ఉత్పత్తి

డిమాండ్‌కు తగినట్టుగా కోళ్లు అందుబాటులో లేకపోవడంతో పెరుగుతున్న ధర

విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి):

దేశవ్యాప్తంగా రోజుల తరబడి కొనసాగుతున్న ఎండ తీవ్రత, వడగాడ్పులు పౌల్ర్టీ పరిశ్రమపై ప్రభావం చూపాయి. వేడి వాతావరణంతో కోళ్ల పెరుగుదల బాగా మందగించింది. రెండు కిలోలకు మించి బరువు పెరగడం లేదు. మార్కెట్‌ డిమాండ్‌కు తగినంతగా కోళ్లు అందుబాటులో లేకపోవడంతో వారం రోజుల నుంచి కోడి మాంసం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో స్కిన్‌లెస్‌ రూ.300 దాటింది. శనివారం నుంచి ఉత్తరాంధ్ర మార్కెట్‌లో కిలో రూ.330గా నిర్ణయించారు. ఆదివారం మార్కెట్‌లో ఇదే ధరకు విక్రయిస్తారు.

ఏపీలోని అన్ని ప్రధాన మార్కెట్‌లలో చికెన్‌ ధరలు ఇదే మాదిరిగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో కిలో చికెన్‌ ధర రికార్డు స్థాయిలో రూ.356 వరకు వెళ్లింది. అయితే ఉత్పత్తి పెరగడంతో గత నెల రూ.230కు దిగివచ్చింది. అయితే ఎండల తీవ్రత వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గడం, మరోవైపు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉండడంతో మార్కెట్‌లో చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత ధరలు ఇదే మాదిరిగా ఉంటాయి తప్ప పెరిగే అవకాశం లేదని బ్యాగ్‌ ప్రతినిధి టి.అప్పారావు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చికెన్‌ ధరలు ఒకేలా ఉన్నాయని, ఎండ తీవ్రత తగ్గే వరకు ఫారాల్లో కోళ్లకు కొంత మేర డిమాండ్‌ ఉంటుందన్నారు.

Updated Date - May 10 , 2026 | 12:24 AM