28, 29 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:46 AM
సింహ‘గిరి ప్రదక్షిణ’ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీపీ, జేసీ, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
అధికారులకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశాలు
32 కిలోమీటర్ల మేర తాగునీటి సౌకర్యం,
బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు,
వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు ఏర్పాటుచేయాలి
ట్రాఫిక్ నిర్వహణ, మళ్లింపుపై
అధ్యయనానికి కమిటీ
విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):
సింహ‘గిరి ప్రదక్షిణ’ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీపీ, జేసీ, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తొలి పావంచా వద్ద అనువంశిక ధర్మకర్త నిర్వహించే పూజా కార్యక్రమం అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. అయితే ఆరోజు ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణ మొదలెడతారన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు 50 క్యూలైన్లు, 100 ఐరన్ స్టాండ్లు ఏర్పాటుచేయాలని, భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని అదనపు కౌంటర్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలన్నారు. గిరి ప్రదక్షిణ మార్గం 32 కిలోమీటర్ల మేర తాగునీటి సౌకర్యం, బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, మొబైల్ మెడికల్ యూనిట్లు, విద్యుద్దీపాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేయాలన్నారు. మొత్తం 50 నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచాలని, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం ఏర్పాటుచేయాలన్నారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, సూచిక బోర్డులు, బారికేడ్లు ముందుగా సిద్ధం చేయాలన్నారు. హనుమంతువాక జంక్షన్‌లో ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, భవనాలు, పోలీసులతో కమిటీ వేయాలన్నారు. భక్తులు జాతీయ రహదారిని దాటేందుకు తాత్కాలికంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుచేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. ట్రాఫిక్ నిర్వహణకు నగర పరిధిలో జీవీఎంసీ కమిషనర్, శివారు ప్రాంతాల్లో జేసీ ఆధ్వర్యంలో కమిటీలు వేయాలన్నారు. భక్తులు నడిచే మార్గంలో రోడ్లు, వీధి లైట్లు మరమ్మతు చేయాలని, తొలి పావంచా వరకు బస్సులు నడపాలన్నారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో బస్సులు పార్కింగ్ చేయకుండా వారికి ప్రత్యామ్నాయ స్థలాలు సిద్ధంగా ఉంచాలన్నారు. లక్షల మంది భక్తులు గిరిప్రదక్షిణ చేసే క్రమంలో దొంగతనాలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు అమర్చాలని కలెక్టర్ ఆదేశించారు. సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు మాట్లాడుతూ జూలై 29వ తేదీన భక్తులకు దర్శనాలు ఉచితంగా కల్పిస్తామన్నారు. సమావేశంలో సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ, జేసీ విద్యాధరి, డీసీపీలు మేరీప్రశాంతి, మణికంఠ, ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.