Share News

సింహగిరికి ఉత్సవ శోభ

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:12 AM

సింహగిరిపై ద్వయావతరునిగా కొలువుదీరిన వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం సోమవారం భక్తులకు లభించనుంది.

సింహగిరికి ఉత్సవ శోభ

నేడే అప్పన్న చందనోత్సవం

నిజరూపంలో దర్శనమివ్వనున్న సింహాచలేశుడు

విద్యుత్‌ దీపాలతో కాంతులీనుతున్న సింహగిరి

1.4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం

విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న హోం మంత్రి అనిత

సింహాచలం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

సింహగిరిపై ద్వయావతరునిగా కొలువుదీరిన వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం సోమవారం భక్తులకు లభించనుంది. ఏటా వైశాఖ బహుళ తృతీయ రోజున మాత్రమే స్వామి నిజరూపంలో సాక్షాత్కరిస్తారు. అరుదైన ఈ దర్శనానికి లక్షలాదిగా భక్తులు సింహగిరికి పోటెత్తుతారు. దేవదాయ, హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల కమిటీ పర్యవేక్షణలో కలెక్టర్‌, సీపీ, దేవదాయశాఖ కమిషనర్‌ల ఆధ్వర్యంలో ఉత్సవం విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఉత్సవంలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట కు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలుపుతారు. 1.30 గంటల నుంచి మూడు గంటల వరకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనము, రుత్విగ్వరణము, పంచకలశావాహనం తరువాత సనాతన ఆచారం ప్రకారం వైదికులు కళ్లకు గంతలు కట్టుకుని, నోటి అడ్డుగా గుడ్డలు కట్టుకుని వెండి శంఖం, చక్రాకార పాత్రలతో తెచ్చిన నీటితో తడిపిన తరువాత వెండి బొరిగెలతో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏడాదిపాటు స్వామి పైపూతగా ఉండి పూజలందుకున్న శ్రీచందనాన్ని తొలగిస్తారు. తరువాత ముందుగా సిద్ధం చేసిన చందనపు ముద్దను హృదయం, శిరస్సుపై ఉంచి, ప్రభాతారాధనలు పూర్తిచేసి కర్పూర నీరాజనాలిస్తారు.

తెల్లవారుజామున మూడు గంటలకు దేవస్థానం అను వంశిక ధర్మకర్త పూజపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పిస్తారు. స్వామివారి శిరస్సుపై నుంచి తొలగించిన చందనం ముక్కను రాజు కుటుంబీకుల తలను తాకిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి వంగలపూడి అనిత, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈఓ పట్టువస్త్రాలు సమర్పించిన తరువాత దేవస్థానం ఈఓ సతీసమేతంగా అంతరాలయం లో నిజరూపాన్ని దర్శించుకోవడం ఆచారం. తెల్లవారుజామున మూడు గంటలకు అనువంశిక ధర్మకర్త కుటుంబీకుల దర్శనం తరువాత, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు (ప్రొటోకాల్‌ ప్రకారం) ఉదయం 5 గంటల వరకు అంతరాలయంలో స్వామిని నిజరూపంలో దర్శించుకుంటారు.

3.30 గంటల నుంచి దర్శనాలు

సామాన్య భక్తుల ఉచిత, రూ.300ల దర్శనం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. రూ.1000 టికెట్లపై ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 9 స్లాట్లలో దర్శనాలు కల్పిస్తారు. ఉదయం 5 గంటల తరువాత అంతరాలయ దర్శనం నిలిపివేస్తారు. ఆ తరువాత ఆలయ ప్రధానద్వారం నీలాద్రి గుమ్మం నుంచి కేవలం లఘుదర్శనం మాత్రమే కల్పిస్తారు. రూ.1500 ప్రొటోకాల్‌ టికెట్లపై ఉదయం 5 గంటల వరకు అంతరాలయంలో, 6 గంటల నుంచి 7.30 గంటల వరకు నీలాద్రిగుమ్మం నుంచి మాత్రమే దర్శనాలు కల్పిస్తారు.

ఇవీ క్యూలైన్లు...

ప్రొటోకాల్‌ టికెట్లు తీసుకున్న భక్తులకు సింహగిరి దేవస్థానం బస్టాండ్‌ గాయత్రి పీఠం ముందు నుంచి క్యూలైన్‌ ప్రారంభమై పీఆర్వో కార్యాలయం, ఉత్తర రాజగోపురం ధ్వజస్తంభం, గరుడ మండపం మీదుగా అంతరాలయంలోకి అనుమతిస్తారు. రూ.1000 టికెట్ల భక్తులు సింహగిరి బస్టాండ్‌లో దుకాణ సముదాయం కాంప్లెక్స్‌ దక్షిణ దక్షిణం వైపు నుంచి ప్రవేశించి పడమర మాడవీధి, నృసింహమండపం ఉత్తర బ్లాక్‌, సుపథ మండపం, ధ్వజస్తంభం ముందు నుంచి, రూ.300 టికెట్ల భక్తులు బస్టాండ్‌లో షాపింగ్‌కాంప్లెక్స్‌ పడమర బ్లాక్‌ వద్ద ప్రారంభమై పడమర మాడవీధి, సుపథ మండపాలు, ఉత్తర రాజగోపురం నుంచి ధ్వజస్తంభం మీదుగా ఆస్థానమండపం మీదుగా నీలాద్రి గుమ్మం నుంచి స్వామిని దర్శించుకుంటారు. సాధారణ భక్తుల క్యూ సింహగిరి బస్టాండ్‌లో షాపింగ్‌కాంప్లెక్స్‌ ఉత్తరం వైపు నుంచి నూతన ప్రసాద పథకం కింద నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌లో ప్రవేశించి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ వెనుకభాగంలో ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటుచేసిన క్యూలైన్ల ద్వారా ప్రధానాలయ దక్షిణ ద్వారం నుంచి నీలాద్రి గుమ్మం వద్ద నిజరూప దర్శన భాగ్యం కల్పించారు.

చందనోత్సవంలో ప్రత్యేకతలు

గతంలో సుమారు ఆరు కిలోమీటర్ల నిడివి గల ఉచిత దర్శన క్యూ ఈ ఏడాది 2.5 కిలోమీటర్లు, రెండు విభాగాలుగా ఏర్పాటుచేశారు.

దేవదాయశాఖ సిబ్బంది పనితీరు మెరుగుకు అధికారులు సుమారు 40 వాకీటాకీలను అందించారు.

భక్తులకు సమాచారం కోసం పెద్దసంఖ్యలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు.

సహస్ర ఘటాభిషేకానికి గంగధార నుంచి నీటిని తీసుకువచ్చేందు కు వీలుగా శాశ్వత ప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మించారు.


ఉత్సవానికి ఎమ్మెల్యేలు దూరం!

పరిమితంగా టికెట్లు జారీచేసిన యంత్రాంగం

కేడర్‌ను సంతృప్తిపరచలేమంటూ నిరాకరించిన శాసనసభ్యులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం చందనోత్సవం పూర్తిగా అధికార యంత్రాంగం చేతుల మీదుగానే జరుగుతోంది. ఉత్సవానికి వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో రద్దీ ఏర్పడి భక్తులందరీ దర్శనాలు చేయించలేకపోతున్నామని భావించిన యంత్రాంగం జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.1500 ప్రొటోకాల్‌ పాసులు 25 చొప్పున జారీచేశారు. ఏటా 100కు తక్కువ లేకుండా టికెట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఆ సంఖ్య తగ్గించడంతో కొందరు ఎమ్మెల్యేలు తిరస్కరించారు. యంత్రాంగం ఇచ్చిన 25 టికెట్లతో ఎవరినీ సంతృప్తిపరచలేమని భావించిన ఎమ్మెల్యేలు టిక్కెట్లను తీసుకోకుండా వదిలేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో కొద్దిమంది నేతలకు టికెట్లు ఇచ్చి మిగిలిన కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోందని భావించడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తాము చందనోత్సవానికి వెళ్లడం లేదని, టికెట్లకు ఒత్తిడి పెట్టవద్దని సూచించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. చందనోత్సవానికి సంబంధించిన సమీక్షా సమావేశాలకు కూడా అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదని ఆయన అనుచరవర్గం ఆరోపిస్తోంది. సింహాచలం భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఆదివారం సాయంత్రం గంటా శ్రీనివాసరావుకు టికెట్లకోటా డబుల్‌ చేయడంతో అతని కార్యాలయం సిబ్బంది తీసుకున్నారని సమాచారం. మరో ఎమ్మెల్యే అంతరాలయ దర్శనం టికెట్లకు బదులుగా రూ.1000 టికెట్లు తీసుకున్నారు. మరో ఎమ్మెల్యే చందనోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు.

గత ఏడాది చందనోత్సవంలో ఏడుగురు భక్తులు మరణించిన నేపథ్యంలో ఈసారి దుర్ఘటనలకు ఆస్కారం లేకుండా ఉత్సవాన్ని విజయంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ బాధ్యతను పూర్తిగా కలెక్టర్‌పైనే పెట్టింది. దీంతో ఇతర ఐఏఎస్‌ అధికారులు జీవీఎంసీ కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌, జాయింట్‌ కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్లను సమన్వయం చేసుకుని ఉత్సవ ఏర్పాట్లు చేసేవారు. దేవాదాయశాఖలోనూ కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గుర్తించి వారి పాత్రను పరిమితం చేశారు. క్యూలైన్‌లో స్థానిక పోలీసులు లేకుండా జాగ్రత్త వహించారు. వీవీఐపీ టికెట్లను రూ.1500, రూ.1000 టికెట్లను పరిమితంగానే ముద్రించి పంపిణీ చేశారు. వీటి విక్రయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినా ఆన్‌లైన్‌ ద్వారానే ఇచ్చామని దేవస్థానం అధికారులు సమర్ధించుకుంటున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 01:12 AM