Share News

సింహాచలం దేవస్థానానికి ట్రస్ట్‌ బోర్డు

ABN , Publish Date - May 15 , 2026 | 01:35 AM

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వం ట్రస్ట్‌ బోర్డును నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజును చైర్మన్‌గా, మరో 16 మందిని సభ్యులుగా నియమించింది.

సింహాచలం దేవస్థానానికి  ట్రస్ట్‌ బోర్డు

చైర్మన్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు

సభ్యులుగా మరో 16 మంది నియామకం

ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలకు,

పార్టీలకు ప్రాధాన్యం

ఇతర జిల్లాల వారికి కూడా అవకాశం

విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వం ట్రస్ట్‌ బోర్డును నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజును చైర్మన్‌గా, మరో 16 మందిని సభ్యులుగా నియమించింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం జిల్లాలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారికి కూడా అవకాశం కల్పించింది. కేవలం నియోజకవర్గం, స్థానికులని కాకుండా, టీటీడీ బోర్డులా సేవ చేయాలని ఆకాంక్షించిన వారికి అవకాశం కల్పించింది. అదే సమయంలో కూటమిలో పార్టీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చింది. ఈ పదవుల్లో ఉత్తరాంధ్ర వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

సభ్యులుగా మక్కెన సీతారాం పాత్రుడు (ఎస్‌.కోట-టీడీపీ), కశిరెడ్డి దామోదర్‌ (భీమిలి -టీడీపీ), చలమూరి భారతి (భీమిలి-టీడీపీ), కరక దేవుడు (పెందుర్తి-టీడీపీ), కనకాల మురళీమోహన్‌ (విజయనగరం-టీడీపీ), వేంపాడడపు అన్నపూర్ణ (చీపురుపల్లి-టీడీపీ), జీతల నీరజ లక్ష్మీకుమారి (అరకులోయ-టీడీపీ), సుసరపు గణపతిరావు (టెక్కలి-టీడీపీ), చల్లంగి జ్ఞానేశ్వరి (పాడేరు-టీడీపీ), పావులూరి శ్రీనివాసరావు (అనపర్తి-టీడీపీ), మధుపాడ సన్యాసిరావు (విశాఖ-బీజేపీ), డా.శ్రీధరి బండ్ల (నరసరావుపేట-టీడీపీ), నీటిపల్లి మహేశ్‌ (పెందుర్తి-జనసేన), పెద్దిశెట్టి ఉషశ్రీ (విశాఖ-జనసేన), లలిత జ్యోతి (పుంగనూరు-టీడీపీ), గుత్తికొండ శ్రీలత (విశాఖ ఉత్తరం-టీడీపీ)కు అవకాశం కల్పించారు.

కనకమహాలక్ష్మి దేవస్థానంలోను అదే విధానం

ఇటీవలె వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి దేవస్థానానికి ట్రస్ట్‌ బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. ఆలయం దక్షిణ నియోజకవర్గంలో ఉంది కాబట్టి తామే ట్రస్ట్‌ బోర్డు సభ్యులను ఎంపిక చేసుకుంటామని అక్కడి కూటమి నాయకులు పట్టుబట్టారు. అయితే జిల్లా పార్టీ నాయకులు దీనిని సున్నితంగా తిరస్కరించారు. అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఇలవేలుపు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని, ఆ నియోజకవర్గానికి పరిమితంగా కొందరిని మాత్రమే ఎంపిక చేసి, జిల్లాలో మిగిలిన వారికి అవకాశం కల్పించారు. ఈ విధానాన్ని అన్ని పార్టీలు హర్షిస్తున్నాయి. పార్టీలకు సేవ చేసిన వారిని గుర్తించి పదవులు ఇచ్చినందుకు వారంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - May 15 , 2026 | 01:35 AM