Share News

కొలువుతీరిన సింహాచలం దేవస్థానం పాలక మండలి

ABN , Publish Date - May 22 , 2026 | 12:27 AM

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది.

కొలువుతీరిన సింహాచలం దేవస్థానం పాలక మండలి

నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం

గోవా నుంచి వర్చువల్‌గా పాల్గొన్న చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు

భక్తితో దైవానికి, భక్తులకు సేవలందించాలని సభ్యులకు పిలుపు

సింహాచలం, మే 21 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. పాలక మండలి చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి ఆశోక్‌గజపతిరాజును కొనసాగిస్తూ 16 మంది సభ్యులు, మరొక ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులతో రాష్ట్ర ప్రభుత్వం పాలక మండలిని నాలుగు రోజుల క్రితం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సింహగిరిపై నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్‌ భవనంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటుచేశారు. సభ్యులకు దేవస్థానం సిబ్బంది ప్రమాణ పత్రాలను అందజేశారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ప్రమాణం చేయించారు. సభ్యులను దేవస్థానం ఎస్‌డిసి మధులత సభకు పరిచయం చేశారు. పాలక మండలి సభ్యులుగా ప్రమాణం చేసిన వారిలో మాకెన సీతారామ్‌పాత్రుడు (నవీన్‌), కసిరెడ్డి దామోదర్‌, చలమూరి భారతి, కరక దేవుడు, కనకాల మురళీమోహన్‌, వి.అన్నపూర్ణ, బీతల నీరజ లక్ష్మీకుమారి, మధుపడ సన్యాసిరావు, డాక్టర్‌ ధరణి బంఢ్ల, నీతిపల్లి మహేష్‌, పెద్దిశెట్టి ఉషశ్రీ, లలితజ్యోతి, గుత్తికొండ శ్రీలత, సుసరపు గణపతిరావు, చల్లంగి జ్ఞానేశ్వరి, పావులూరి శ్రీనివాసరావు ఉన్నారు. ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా అప్పన్న ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పాలక మండలి సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా బోకం స్వామినాయుడు, వేదుల దక్షిణామూర్తి ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తి, కోళ్ల లలితకుమారి హాజరై...పాలక మండలి సభ్యులను అభినందించారు.

ఆలయ పవిత్రతను కాపాడాలి: చైర్మన్‌ పూసపాటి

ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో గోవా నుంచి వర్చువల్‌గా పాల్గొన్న చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ఆలయ పవిత్రతను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను నూతనంగా నియమింపబడిన పాలకమండలి సభ్యులు కాపాడాలన్నారు. తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తితో దైవానికి, భక్తులకు సేవలందించాలన్నారు.

Updated Date - May 22 , 2026 | 12:27 AM