Share News

సింహాచలం ఈఈ శ్రీనివాసరాజుకు మళ్లీ పోస్టింగ్‌!

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:54 AM

ఎన్ని అడ్డగోలు పనులు చేసినా ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు.

సింహాచలం ఈఈ శ్రీనివాసరాజుకు మళ్లీ పోస్టింగ్‌!

  • గత ఏడాది చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనలో సస్పెన్షన్‌

  • ఏడాది తిరగముందే విధుల్లోకి...

  • తప్పులు చేస్తున్నా చర్యలు చేపట్టని ఉన్నతాధికారులు

  • దేవదాయ శాఖలో సిత్రాలు

    విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

ఎన్ని అడ్డగోలు పనులు చేసినా ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు. తప్పు చేశారని రుజువైన తరువాత కూడా కఠిన చర్యలు తీసుకోకుండా తిరిగి పోస్టింగ్‌ ఇస్తూ రాష్ట్ర ప్రజలను నివ్వెరపరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా, కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఓగా, ఎర్నిమాంబ ఆలయం ఈఓగా, సంపత్‌ వినాయక్‌ ఆలయం ఈఓగా, అనకాపల్లి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించి, లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కొన్న కాళింగరి శాంతి తప్పనిసరి స్థితిలో ఎన్‌టీఆర్‌ జిల్లాకు బదిలీపై వెళ్లారు. భర్త పేరు రికార్డుల్లో మార్పు వ్యవహారంలో మీడియాకు ఎక్కిన ఆమెను ప్రభుత్వం 2025లో సస్పెండ్‌ చేసింది. ఆ తరువాత సర్వీస్‌ నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసు ఇచ్చింది. అయితే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆమెకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం దేవదాయ శాఖ కల్పించింది. చివరకు జాతీయ ఎస్‌టీ కమిషన్‌ సిఫారసు, హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఆమెకు పోస్టింగ్‌ ఇస్తున్నట్టు దేవదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెపై కఠిన చర్యలు తీసుకోలేదు. ఇది జరిగి 24 గంటలు కాకముందే అదే దేవదాయ శాఖ మరో కీలక జీఓను బుధవారం జారీచేసింది. గత ఏడాది చందనోత్సవం నాడు (ఏప్రిల్‌ 30) సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. సింహగిరి మాస్టర్‌ ప్లాన్‌లో లేని గోడను దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరాజు, పర్యాటక శాఖ ఈఈ రమణల ఆదేశంతోనే నిర్మించానని కాంట్రాక్టర్‌ స్పష్టం చేయడంతో విచారణ కమిటీ సిఫారసు మేరకు ఏడుగురిని సస్పెండ్‌ చేశారు. అందులో ఈఈ శ్రీనివాసరాజు కూడా ఉన్నారు. ఆయనపై ఈ ఘటనకు సంబంధించి క్రిమినల్‌ కేసు కూడా నమోదుచేశారు. ఆయనపై విచారణ ఇంకా కొనసాగుతోంది. మళ్లీ చందనోత్సవం రాక ముందే ఆయనకు పోస్టింగ్‌ ఇస్తూ దేవదాయ శాఖ బుఽధవారం జీఓ ఇచ్చింది. శ్రీనివాసరాజు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారని, ఏడాదికి మించి సస్పెన్షన్‌లో కొనసాగించకూడదని నిబంధనలు చెబుతున్నందున, విచారణలో తప్పులు రుజువైతే ఎటువంటి శిక్ష అయినా భరిస్తానని సదరు అధికారి చెబుతున్నందున వెంటనే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హైకోర్టు సూచించడంతో ఉద్యోగం ఇస్తున్నామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సింహాచలానికి దూరంగా పోస్టింగ్‌ ఇవ్వాలని సూచించడంతో శ్రీకాళహస్తి శ్రీజ్ఞానప్రసూనాంబ ఆలయం ఈఈగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఆభరణాలు మాయం కేసులూ అంతే

సింహాచలంలో ఆభరణాల లెక్కల్లో తేడాలు ఉన్నాయని తనిఖీల్లో వెల్లడి కావడంతో ఏడాది నుంచి విచారణ జరుపుతున్నారు. రెండు సార్లు లెక్కలు వేశారు. తప్పులు జరిగాయని తేలింది. నివేదికలు కూడా కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లాయి. కానీ ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. అలాగే కనకమహాలక్ష్మి ఆలయంలో వెండి తాపడం లెక్కల్లో తేడాలు ఉన్నాయని తేలింది. వాటిపై కూడా ఇప్పటివరకూ చర్యలు లేవు. ప్రధాన ఆలయాల్లో తప్పులు జరుగుతున్నా కమిషనర్‌ కార్యాలయం కఠినంగా వ్యవహరించడం లేదు. అక్కడ పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది.


33 పంచాయతీల్లో శతశాతం పన్ను వసూలు

మొత్తమ్మీద 89.11 శాతం వసూళ్లతో రాష్ట్రంలో రెండో స్థానం

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిల్లాలోని 33 గ్రామ పంచాయతీలు శతశాతం పన్నులు వసూలు చేశాయి. జిల్లాలో 79 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం కలిపి బుధవారం నాటికి 89.11 శాతం పన్నులు వసూలు చేయడంతో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఆనందపురం మండలం భీమన్నదొరపాలెం, కోలవానిపాలెం, బంటుపల్లివారి కల్లాలు, శిర్లపాలెం, బోని, పేకేరు, మామిడిపాలెం, భీమిలి మండలం అవనాం, నగరపాలెం, బోడమెట్టపాలెం, మజ్జిపేట, లక్ష్మీపురం, నారాయణరాజుపేట, మూలకుద్దు, పద్మనాభం మండలం పెంట, శేరిఖండం, బాందేవపురం, చెన్నాపురం, వెంకటాపురం, తునివలస, పద్మనాభం, కొవ్వాడ, బుడ్డివలస, బీఆర్‌ తాళ్లవలస, విలసన్నపాలెం, కృష్ణాపురం, ఐనాడ, పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం, గవరపాలెం, పెదగాడి, ముదపాక, గొరపల్లి, చింతగట్ల పంచాయతీల్లో శతశాతం పన్నులు వసూలయ్యాయి. ఆనందపురం మండలం బంటువారికల్లాల పంచాయతీలో పన్నుల రూపేణా రూ.9.7 లక్షలు వసూలైంది. పన్ను వసూళ్లలో భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం 62 శాతంతో జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. నెలాఖరుకు ప్రతి పంచాయతీ 100 శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించామని జిల్లా పంచాయతీ అధికారి ఎంఎన్వీ శ్రీనివాసరావు తెలిపారు. వెనుకబడిన పంచాయతీలపై రోజువారీ సమీక్ష చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Mar 26 , 2026 | 12:54 AM