సింహాచలం జనసంద్రం
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:27 AM
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సింహగిరి ప్రదక్షిణ రెండో రోజూ కొనసాగింది. సాధారణంగా తొలిరోజు ప్రదక్షిణ ప్రారంభించి, మరుసటిరోజు ఉదయానికి ముగించేవారు. కానీ ఈసారి రెండో రోజు (బుధవారం) మధ్యాహ్నం వరకు తొలిపావంచా వద్దకు భక్తులు వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారు. దీంతో బుధవారం కూడా అడవివరం, వేపగుంట, సింహాచలం ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాధారణ ప్రజల రాకపోకలకు వీల్లేకుండా పోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం బుధవారం ఉదయం ఐదు గంటల సమయానికి తొలి పావంచా వద్ద స్వామి వారిని 5,84,149 మంది దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తులు వచ్చినా అధికారులు వారిని లెక్కలోకి తీసుకోలేదు. మొత్తం ఆరు లక్షల మందికిపైగా గిరి ప్రదక్షిణలో పాల్గొని ఉంటారని అంచనా.
రెండో రోజూ కొనసాగిన గిరి ప్రదక్షిణ
మధ్యాహ్నం వరకూ తొలిపావంచా వద్దకు భక్తులు
ఉదయం 5 గంటల వరకూ సుమారు
5,84,149 మంది పాల్గొన్నట్టు అధికారుల అంచనా
మొత్తమ్మీద ఆరు లక్షల మందికి పైగా రాక
అలసిపోయి నడిరోడ్డుపై భక్తుల నిద్ర
ఆర్టీసీ బస్సుల్లో 4,42,500 మంది తరలింపు
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సింహగిరి ప్రదక్షిణ రెండో రోజూ కొనసాగింది. సాధారణంగా తొలిరోజు ప్రదక్షిణ ప్రారంభించి, మరుసటిరోజు ఉదయానికి ముగించేవారు. కానీ ఈసారి రెండో రోజు (బుధవారం) మధ్యాహ్నం వరకు తొలిపావంచా వద్దకు భక్తులు వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారు. దీంతో బుధవారం కూడా అడవివరం, వేపగుంట, సింహాచలం ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాధారణ ప్రజల రాకపోకలకు వీల్లేకుండా పోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం బుధవారం ఉదయం ఐదు గంటల సమయానికి తొలి పావంచా వద్ద స్వామి వారిని 5,84,149 మంది దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తులు వచ్చినా అధికారులు వారిని లెక్కలోకి తీసుకోలేదు. మొత్తం ఆరు లక్షల మందికిపైగా గిరి ప్రదక్షిణలో పాల్గొని ఉంటారని అంచనా.
నడి రోడ్డుపైనే ఆదమరిచి నిద్ర
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో యాత్రను ప్రారంభించి బుధవారం ఉదయం పది, పదకొండు గంటలు దాటిన తరువాత తొలి పావంచా వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది నడిరోడ్డుపైనే ఆదమరిచి నిద్రపోయారు. మహిళలు నిలబడే ఓపిక కూడా లేక రోడ్డు మధ్యలోనే కూర్చుని బస్సుల కోసం ఎదురుచూశారు. మరికొందరు రోడ్డు మధ్య డివైడర్లపై కూర్చుని అలసట తీర్చుకున్నారు. ఇలాంటి సన్నివేశాలు గతంలో ఎన్నడూ కనిపించలేదు. తొలి పావంచా వద్ద ప్రదక్షిణ పూర్తి చేసినవారు బస్సుల్లో ఇళ్లకు వెళ్లిపోయేవారు. లేదంటే కొండ పైకి వెళ్లి స్వామి దర్శనం చేసుకునేవారు. తొలిరోజు మంగళవారం 400 బస్సులు ఏర్పాటు ఏసిన ఆర్టీసీ అధికారులు బుధవారం వాటిలో పది శాతమే నడిపారు. దాంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 4,42,350 మంది భక్తులను తొలి పావంచా వద్ద నుంచి తరలించారు. బుధవారం ఉదయం 11 గంటలకు నాలుగు వేల మంది బస్సులు ఎక్కారు. అయితే 12 గంటల సమయానికి కేవలం 40 బస్సులే అందుబాటులో ఉన్నాయి. అవి సరిపోక చాలామంది ఏ వాహనం కనిపిస్తే అది ఎక్కి గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ క్రమంలో చాలా మంది అంబులెన్స్‌లపైకి ఎక్కి కూడా ప్రయాణించారు.
గిరి ప్రదక్షిణకు అధికారుల అంచనాకు మించి భక్తులు వచ్చారు. దాంతో ట్రాఫిక్ సమస్యలు గత ఏడాది కంటే పెరిగాయి. భక్తులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసిన అధికారులు మిగిలిన నగర ప్రజల రాకపోకల గురించి విస్మరించారు. పోలీసులు విరామం, విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించినా దానికి తగిన ఫలితం దక్కలేదు. ప్రణాళికాలోపం స్పష్టంగా కనిపించింది. సమస్య ఉత్పన్నమైన వెంటనే దానిని పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నగర ప్రజలు ట్రాఫిక్‌లో గంటల కొద్దీ చిక్కుకుపోయారు. వేలాది సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, దాని పర్యవేక్షణకు ఉన్నతాధికారులు ఉన్నా, సమస్మాత్మక ప్రాంతాల్లో ఇబ్బందులను గుర్తించినా పరిష్కరించలేకపోయారు. ఆ ఛాయలకు వెళ్లే ధైర్యం కూడా చేయలేక, దిగువ స్థాయి సిబ్బందికి ఆ బాఽధ్యత వదిలేశారు.