కరువు ఛాయలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:43 AM
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ నుంచి ఇంతవరకు సాధారణ వర్షపాతంలో సగం మాత్రమే కురిసింది. ప్రస్తుత సమయానికి 70 శాతం విస్తీర్ణంలో వరినాట్లు పూర్తికావాల్సి వుండగా.. ఇంతవరకు ఐదు శాతం విస్తీర్ణంలో కూడా నాట్లు వేయలేదు. అదికూడా విద్యుత్ మోటార్లు వున్న బోర్లు, రిజర్వాయర్ల ఆయకట్టు కింద మాత్రమే అరకొరగా నాట్లు పడుతున్నాయి. మిగిలిన వర్షాధార భూముల్లో వరితోపాటు ఇతర పంటలు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
జిల్లాలో తీవ్రవర్షాభావ పరిస్థితులు
అన్నదాతలకు కష్టకాలం
జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణంకన్నా 48.4 శాతం లోటు వర్షపాతం
కురవాల్సింది 424.6 మి.మీ.
కురిసింది 219.2 మి.మీ.
పది శాతం విస్తీర్ణంలో కూడా పూర్తికాని వరినాట్లు
నీరు లేక మడుల్లో ఎండిపోతున్న నారు
చెరువులు, గ్రోయిన్ల కింద ఆయకట్టు పరిస్థితి మరింత దారుణం
పంటలు వేయక బీడులను తలపిస్తున్న పొలాలు
--------
జిల్లాలో వర్షపాతం వివరాలు.
నెల సాధారణం నమోదైనది లోటు
జూన్ 123.2 మి.మీ. 97.5 మి.మీ. 20.9 శాతం
జూలై 175.9 మి.మీ. 45.4. మి.మీ. 74.2 శాతం
ఆగస్టు 125.5 మి.మీ. 76.3.మి.మీ. 39.2. శాతం
(21 వరకు)
మొత్తం 424.6 మి.మీ. 219.2. మి.మీ. 48.4 శాతం
------
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ నుంచి ఇంతవరకు సాధారణ వర్షపాతంలో సగం మాత్రమే కురిసింది. ప్రస్తుత సమయానికి 70 శాతం విస్తీర్ణంలో వరినాట్లు పూర్తికావాల్సి వుండగా.. ఇంతవరకు ఐదు శాతం విస్తీర్ణంలో కూడా నాట్లు వేయలేదు. అదికూడా విద్యుత్ మోటార్లు వున్న బోర్లు, రిజర్వాయర్ల ఆయకట్టు కింద మాత్రమే అరకొరగా నాట్లు పడుతున్నాయి. మిగిలిన వర్షాధార భూముల్లో వరితోపాటు ఇతర పంటలు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే వరుణుడు ముఖం చాటేశాడు. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 424.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి వుంది. కానీ ఈ ఏడాది 219.2 మి.మీ. (51.62 శాతం) మాత్రమే కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 123.2 మి.మీ. కాగా 97.5 మి.మీ. మాత్రమే కురిసింది. జూలైలో పరిస్థితి అత్యంత దారుణంగా వుంది. సాధారణ వర్షపాతం 175.9 మి.మీ. కాగా 45.4 మి.మీ. మాత్రమే కురిసింది. ఆగస్టులో 21వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 124.5 మి.మి.కాగా 76.3 మి.మీ. కురిసింది. వరినారుమళ్లకు కీలకమైన జూలై నెలలో కనీస్థాయిలో కూడా వర్షాలు పడకపోవడంతో చాలా మంది రైతులు ఆకుమడుల్లో విత్తనాలు చల్లలేదు. అదపాదడపా కురిసిన జల్లులతో అక్కడక్కడా ఆకుమడుల్లో విత్తనాలు వేయగా.. అవి మొలకెత్తిన తరువాత సరిపడ వర్షాలు లేకపోవడంతో నారు ఎదుగుల లేక మడుల్లోనే ఎండిపోతున్నది. కొద్దిమంది రైతులు వ్యయప్రయాసాలతో ఇతర చోట్ల నుంచి నీటిని తెచ్చుకొని వరినారును బతికించుకున్నప్పటికీ.. పొలాలను దమ్ము చేయడానికి నీరు లేకపోవడంతో మడుల్లోనే నారునే వదిలేయాల్సి వచ్చింది.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 56,329 హెక్టార్లలో వరి సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. కానీ ఇంతవరకు 4,111 హెక్టార్లలో (7.3 శాతం) మాత్రమే వరినాట్లు వేశారు. విద్యుత్ మోటార్లు వున్న బోర్లు కింద, రిజర్వాయర్ల ఆయకట్టులో మాత్రమే అరకొరగా వరినాట్లు పడుతున్నాయి. జిల్లాలోని సాగునీటి చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో వీటి కింద వున్న భూముల్లో కూడా వరినాట్లు వేసే పరిస్థితి లేదు. కొన్ని గ్రామాల్లో బావుల ఆధారంగా వరి సాగు చేస్తుంటారు. ఈ ఏడాది బావుల్లో సైతం నీరు లేకపోవడంతో వరినాట్లు వేయలేదు. ఇక శారదా, పెద్దేరు, వరహా, సర్పా, బొడ్డేరు నదుల్లో నీరు లేకపోవడంతో వీటిపై నిర్మించిన గ్రోయిన్లు/ ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు ప్రవహించడంలేదు. గ్రోయిన్లు/ ఆనకట్టల కింద ఉన్న సుమారు 40 వేల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది.