Share News

శంకుస్థాపనతో సరిపెట్టిన సిఫీ

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:41 AM

విశాఖపట్నంలో కొన్ని సంస్థలు భూములు తీసుకొని శంకుస్థాపనలు చేసి ఆ తరువాత పనులు మాత్రం ప్రారంభించడం లేదు.

శంకుస్థాపనతో సరిపెట్టిన సిఫీ

ఏడాదైనా ప్రారంభం కాని డేటా సెంటర్‌ నిర్మాణం

రుషికొండ ఐటీ పార్కు హిల్‌ నంబరు-3పై 3.6 ఎకరాలు కేటాయింపు

2027 అక్టోబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని డెడ్‌లైన్‌

పరదేశిపాలెంలో మరో 25 ఎకరాలు కేటాయింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో కొన్ని సంస్థలు భూములు తీసుకొని శంకుస్థాపనలు చేసి ఆ తరువాత పనులు మాత్రం ప్రారంభించడం లేదు. వందల కోట్ల రూపాయల విలువైన భూములను అతి తక్కువ ధరకు ఇచ్చినా సరే నిర్మాణాలు చేపట్టకపోవడం గమనార్హం. కొన్ని సంస్థలైతే పనులు చేయకుండానే అదనంగా భూములు తీసుకుంటున్నాయి.

సిఫీ టెక్నాలజీ సంస్థ డేటా సెంటర్‌ ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3.6 ఎకరాలు తీసుకుంది. రుషికొండ ఐటీ పార్కు హిల్‌ నంబరు-3పై 3.6 ఎకరాల భూమి విలువ రూ.150 కోట్లు కాగా ప్రభుత్వం రూ.3.6 కోట్లకేఇచ్చింది. గత ఏడాది అక్టోబరులోనే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అందులో 50 మెగావాట్ల డేటా సెంటర్‌ను రూ.1,500 కోట్లతో నిర్మిస్తామని వేయి మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. అప్పుడు ఐటీ మంత్రి ఆపరేషన్‌కు డెడ్‌లైన్‌ పెట్టారు. రెండేళ్లలో అంటే 2027 అక్టోబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. భవన నిర్మాణానికి సంస్థ దరఖాస్తు చేసుకుంటే ఏపీఐఐసీ ఎటువంటి అడ్డంకులు పెట్టకుండా అనుమతులు కూడా ఇచ్చింది. కానీ సిఫీ ఇప్పటివరకూ పనులు ప్రారంభించలేదు. ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉంది. అప్పటిలోగా ఎలా పూర్తి చేస్తారనేది అనుమానంగా ఉంది.

మరో 25 ఎకరాలు

సాధారణంగా ఇలాంటి సంస్థలు గడువులోగా పనులు పూర్తి చేస్తే అదనపు ప్రాజెక్టులకు మరింత భూమి ఇస్తారు. కానీ సిఫీ మొదటి ప్రాజెక్టును ప్రారంభించకపోయినా పరదేశిపాలెంలో మరో 500 మెగావాట్ల డేటా సెంటర్‌కు అక్కడ 25 ఎకరాలు ఈ ఏడాది జూన్‌లో కేటాయించారు. అక్కడైతే ఎకరా కేవలం రూ.50 లక్షలకే ఇచ్చారు. అందులో రూ.15,226 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. అయితే సిఫీ యాజమాన్యం రెండుచోట్ల పనులు ప్రారంభించకపోవడం గమనార్హం.

అనుమతులు ఇచ్చేశాం

సిఫీ డేటా సెంటర్‌ నిర్మాణం గురించి ఏపీఐఐసీ అధికారులను సంప్రతించగా, రుషికొండలో 50 మెగావాట్ల డేటా సెంటర్‌ నిర్మానానికి అవసరమైన అనుమతులు తాము ఇచ్చేశామని, వారే ఇంకా పనులు ప్రారంభించలేదని తెలిపారు. వీలైనంత త్వరగా చేయాలని చెబుతున్నామన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:41 AM