Share News

బీచ్‌లో షవర్‌లు

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:32 AM

ఈనెల 28న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ను కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు.

బీచ్‌లో షవర్‌లు

గిరి ప్రదక్షిణ భక్తుల కోసం ఏర్పాటుచేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు

అధికారులతో కలిసి ప్రదక్షిణ మార్గం పరిశీలన

హనుమంతవాక జంక్షన్‌ వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌కు సూచన

ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు

విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

ఈనెల 28న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ను కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు. బీచ్‌లో స్నానాలు చేసేందుకు భక్తులు, ప్రధానంగా మహిళలు ఇబ్బంది పడుతున్నందున వారికోసం షవర్‌బాత్‌లను ఏర్పాటుచేయాలని సూచించారు. ఆయన మంగళవారం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌, సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావుతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. భక్తులు నడిచే రోడ్డు సక్రమంగా ఉందా?, లేదా?...అనేదానితోపాటు వీధి దీపాలు, మార్గం వెంబడి మరుగుదొడ్లు, డస్ట్‌బిన్‌లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టం, తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్స, కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. భక్తులు హనుమంతవాక జంక్షన్‌ వద్ద జాతీయ రహదారి దాటి విశాలాక్షి నగర్‌ వైపు వేళ్లే సమయంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీపీ శంఖబ్రతబాగ్చికు సూచించారు. ఆర్టీసీ బస్సుల దారిమళ్లింపు, పార్కింగ్‌ సదుపాయాలపై కూడా మాట్లాడారు. భక్తులకు తాగునీరు, స్నానాలు చేసేందుకు వీలుగా బీచ్‌లో డ్రమ్ముల్లో నీరు, బకెట్లు, మగ్గులను అందుబాటులో ఉంచాలని, సముద్రంలో స్నానాలకు దిగడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మహిళలు, చిన్నారులకు సౌకర్యంగా ఉండేలా షవర్‌బాత్‌ సదుపాయం కల్పించాలని జీవీఎంసీ కమిషనర్‌కు సూచించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటుచేయాలని, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రోడ్డుపై ఎక్కడికక్కడ డస్ట్‌బిన్‌లను ఏర్పాటుచేయాలని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖభత్ర బాగ్చీ మాట్లాడుతూ భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రధానంగా మార్గం పొడవునా డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజినల్‌ మేనేజర్‌ అప్పలనాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ నల్లనయ్య, ప్రధాన వైధ్యాధికారి ఈఎన్‌వి నరేష్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్లు కేశవ ప్రసాద్‌, అయ్యప్పనాయుడు, ఆర్‌డీవో సంగీత్‌ మాథుర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:32 AM