Share News

నలుగురు ఎస్టీవోలకు షోకాజ్‌

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:34 AM

సీతమ్మధారలోని డివిజనల్‌ సబ్‌ ట్రెజరీలో పింఛన్‌దారుల పేరిట సొమ్ములు స్వాహా చేసిన వ్యవహారంలో నలుగురు ఉప ఖజానా అధికారులకు రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్‌ షోకాజ్‌ జారీచేశారు.

నలుగురు ఎస్టీవోలకు షోకాజ్‌

సీతమ్మధార సబ్‌ట్రెజరీ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు అభియోగాలు

డిస్మిస్‌ అయిన ఉద్యోగికి నోటీసు

ఇదే వ్యవహారంలో గతంలో 11 మంది సీనియర్‌ అకౌంటెంట్లకు నోటీసులు

విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

సీతమ్మధారలోని డివిజనల్‌ సబ్‌ ట్రెజరీలో పింఛన్‌దారుల పేరిట సొమ్ములు స్వాహా చేసిన వ్యవహారంలో నలుగురు ఉప ఖజానా అధికారులకు రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్‌ షోకాజ్‌ జారీచేశారు. ఆనందకుమార్‌ (విశాఖ జిల్లా ట్రెజరీ కార్యాలయం), వీవీఎస్‌ నాయుడు (విజయనగరం జిల్లా ఖజానా కార్యాలయం), జోగారావు (అనకాపల్లి సబ్‌ట్రెజరీ), మీనమ్మ (చోడవరం సబ్‌ట్రెజరీ)కు తాజాగా నోటీసులు అందాయి. వీరంతా కుంభకోణం జరిగిన సమయంలో సీతమ్మధార సబ్‌ ట్రెజరీలో జూనియర్‌/సీనియర్‌ అకౌంటెంట్లుగా ఉండేవారు. ఆ తరువాత పదోన్నతి పొందారు.

నగరంలో వేలాది మంది రిటైర్డు ఉద్యోగులకు ప్రతి నెలా సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ ట్రెజరీ నుంచి పింఛన్లు బట్వాడా చేస్తుంటారు. ఏడాదికి ఒకసారి ప్రతి పింఛన్‌దారుడు లైఫ్‌ సర్టిఫికెట్‌ను ట్రెజరీకి అందజేయాలి. అదేవిధంగా ఎవరైనా చనిపోయినట్టయితే కుటుంబ సభ్యులు డెత్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. 2011 సంవత్సరం వరకూ సర్టిఫికెట్లు మాన్యువల్‌గా తీసుకుని అప్‌లోడ్‌ చేసే విధానం ఉండేది. ఈ నేపథ్యంలో పింఛన్‌దారుడు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా సబ్‌ ట్రెజరీ సిబ్బంది దానిని అప్‌లోడ్‌ చేయకుండా ఆ మొత్తం ప్రతి నెలా వేరొక బ్యాంకు అకౌంట్‌లో జమ చేసి డ్రా చేసుకునేవారు. మరికొంతమంది విషయంలో పింఛన్‌దారుడు చనిపోయినట్టు సర్టిఫికెట్‌ తీసుకువచ్చిన కుటుంబ సభ్యులతో ట్రెజరీ ఉద్యోగులు కుమ్మక్కై, వచ్చిన పింఛన్‌ చెరిసగం పంచుకున్నారు. ఇలా 2011 నుంచి 2017 వరకూ సుమారు రూ.ఆరు కోట్ల వరకు స్వాహా జరిగింది. సొమ్ములు పక్కదారిపట్టినట్టు 2018లో వెలుగులోకి రావడంతో అప్పట్లో కొందరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయగా, ఇద్దరు, ముగ్గురిని అరెస్టు చేశారు. వెంకటనరసింగరావు అనే ఉద్యోగి నుంచి సుమారు రూ.95 లక్షలు రికవరీ చేశారు. ఈ కుంభకోణంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా విచారించి 2021లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి పలుమార్లు విజిలెన్స్‌ అధికారులు వార్షిక నివేదికలలో ట్రెజరీ కుంభకోణం విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. చివరకు ఈ ఏడాది ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుతం విశాఖ జిల్లా కార్యాలయంతో పాటు అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న 11 మందికి నవంబరులో చార్జిమెమోలు జారీచేశారు. ఇదే కుంభకోణంలో మరో నలుగురికి తాజాగా రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్‌ షోకాజ్‌ జారీచేశారు. అలాగే అప్పట్లో డిస్మిస్‌ అయిన సూరిబాబుకు జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కవిటి మోహనరావు నోటీస్‌ జారీచేశారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అంతకంటే ఎక్కువ హోదాలో ఉన్న అధికారులకు ప్రభుత్వమే నోటీసులు జారీ చేయనున్నది.

Updated Date - Jan 06 , 2026 | 01:34 AM