Share News

అడ్డగోలు డీలర్లకు షోకాజ్‌?

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:49 AM

గడువు కంటే ముందే సరకులు పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమైంది.

అడ్డగోలు డీలర్లకు షోకాజ్‌?

ఆంధ్రజ్యోతి ఎఫెక్టు

రంగం సిద్ధం చేస్తున్న అధికారులు

వన్‌టౌన్‌ ఏరియాలో ఆగడాలపై చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్ల మౌనం

విశాఖపట్నం/మహారాణిపేట, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):

గడువు కంటే ముందే సరకులు పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమైంది. గతనెల 26 నుంచి 31 వరకు వృద్ధులు, దివ్యాంగులకు మినహా ఇతరులకు సరకులు పంపిణీ చేసిన డీలర్ల వివరాలు సేకరించాలని ఏఎస్‌వోలు, చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లను జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ ఆదేశించారు. ‘రేషన్‌ డీలర్ల ఇష్టారాజ్యం’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.

నిబంధనల మేరకు ప్రతినెలా ఒకటోతేదీ నుంచి కార్డుదారులకు సరకులు అందించాలి. వృద్ధులు/దివ్యాంగులకు ముందునెల 26 నుంచి ఇళ్లకు తీసుకెళ్లి అందించాలి. అయితే వన్‌టౌన్‌ పరిధిలో కొంతమంది డీలర్లు ఒకటోతేదీన ఇవ్వాల్సిన సరకులు ముందుగాన పంపిణీ చేయడంపై పూర్తి వివరాలు సేకరించాలని డీఎస్వో ఆదేశించారు. వివరాలు అందిన వెంటనే ఆయా డీలర్లకు షోకాజ్‌ నోటీసులు జారీచేసి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ఆగడాలపై చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్ల మౌనం

కోట వీధి నుంచి జగదాంబ జంక్షన్‌ వరకు వన్‌టౌన్‌. ఈ పరిధిలో పలువురు రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నా చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక డీలరు బియ్యంతోపాటు టన్ను రాగులు పంపిణీ చేశారు. మరో డీలరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. సిబ్బందినే బెదిరిస్తున్నారనే వాదనా వినిపిస్తోంది. దీంతో అధికారులు ఇటీవల హెచ్చరించారని, అయినా తీరు మారలేదని అంటున్నారు.


బార్‌లకు 32 దరఖాస్తులు

ఈనెల 4 వరకు గడువు

5న లాటరీ ద్వారా లైసెన్స్‌ల జారీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని బార్‌ లైసెన్స్‌లకు వ్యాపారుల నుంచి స్పందన కనిపిస్తోంది. 52 బార్‌లకు లైసెన్స్‌ ఇచ్చేందుకు నోటిఫికేషన్‌ జారీచేయగా, ఇప్పటివరకు 32 మంది ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నారు. జిల్లాలో 121 బార్‌లకు ఆశాఖ అధికారులు నోటిఫై చేశారు. లైసైన్స్‌ల జారీకి గత ఏడాది నోటిఫికేషన్‌ జారీచేయగా 69 బార్‌లకు మాత్రమే దరఖాస్తులు రావడంతో లాటరీ ద్వారా కేటాయించారు. మిగిలిన 52 బార్‌లకు గతనెల 30న నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈనెల 4 వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. దీంతో శనివారం 32 మంది రూ.పది వేలు చొప్పున ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో పేర్లను నమోదుచేసుకున్నారు. గడువు ముగిసేలోగా మరిన్ని దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. ఈనెల ఐదున లాటరీతీసి లైసెన్స్‌లు జారీచేస్తామని ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌ వివరించారు.

Updated Date - Feb 02 , 2026 | 12:49 AM