Share News

జీసీసీ కాఫీ గింజలు కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:55 PM

ఆదివాసీ రైతులు పండించిన కాఫీ చెర్రీ గింజలను గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్‌ చేశారు.

జీసీసీ కాఫీ గింజలు కొనుగోలు చేయాలి
యర్రబంద గ్రామంలో ఆందోళన చేస్తున్న ఆదివాసీ కాఫీ రైతులు, గిరిజన సంఘం నాయకులు

వారం రోజుల్లో స్పందించకపోతే చింతపల్లి డీఎం కార్యాలయం ముట్టడి

గిరిజన సంఘం నాయకుల హెచ్చరిక

చింతపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు పండించిన కాఫీ చెర్రీ గింజలను గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్‌ చేశారు. సోమవారం యర్రబొమ్మలు పంచాయతీ యర్రబంద గ్రామంలో ఆదివాసీ కాఫీ రైతులతో కలిసి గిరిజన సంఘం నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భగా సాగిన చిరంజీవి మాట్లాడుతూ కొంత కాలంగా జీసీసీ గిరిజన రైతులు పండించిన కాఫీ గింజలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తుందన్నారు. కాఫీ సీజన్‌ ప్రారంభంలో గిరిజనులు పండించిన కాఫీ గింజలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించవద్దని జీసీసీ ఉద్యోగులు రైతుల ఇళ్లకు వచ్చి హామీ ఇచ్చారన్నారు. ఈ ఏడాది జీసీసీ అపెక్స్‌ కమిటీ సిఫారసు మేరకు కాఫీ పార్చిమెంట్‌ కిలో రూ.450, చెర్రీ రూ.270 ధరలుగా నిర్ణయించిందన్నారు. జనవరి నెలాఖరు వరకు మాత్రమే రైతుల నుంచి తక్కువ పరిమాణంలో కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేసిందన్నారు. ఫిబ్రవరి నుంచి కాఫీ గింజల కొనుగోలును జీసీసీ నిలిపివేసిందని చెప్పారు. దీంతో రైతులు కాఫీ గింజలను అమ్ముకోకుండా ఇళ్లలో భద్రపరుచుకుని జీసీసీ ఎప్పుడు కొనుగోలు చేస్తుందా? అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. చింతపల్లి మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వెంటనే జీసీసీ కాఫీ గింజలు కొనుగోలు చేయాలని తీర్మానం చేసి కలెక్టర్‌, జీసీసీ ఎండీకి పంపించినప్పటికి అధికారుల్లో చలనం కనిపించడం లేదన్నారు. వారం రోజుల్లో జీసీసీ అధికారులు రైతుల నుంచి కాఫీ గింజల కొనుగోలును పునఃప్రారంభించాలన్నారు. అధికారులు స్పందించకపోతే చింతపల్లి జీసీసీ డీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సెగ్గె సత్తిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమణమూర్తి, కాఫీ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:55 PM