Share News

‘మొంథా’ పనులకు కాసుల కొరత

ABN , Publish Date - May 13 , 2026 | 01:03 AM

గత ఏడాది అక్టోబరులో సంభవించిన మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న సాగునీటి వనరులు, నదుల గట్లు, ఆనకట్టలు వంటివి ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. అప్పట్లో చేపట్టిన తాత్కాలిక పనులు తప్ప, ఇంతవరకు శాశ్వత పనులు చేయలేదు. వీటి మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం సుమారు పన్నెండున్నర కోట్ల రూపాయలు అవసరమని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం మొదలవుతుందని, ఈలోగా పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవని రైతులు అంటున్నారు.

‘మొంథా’ పనులకు కాసుల కొరత
మొంథా తుఫాన్‌తో రాంబిల్లి మండలం వైలోవ వద్ద భారీ గండి పడిన శారదా నది గట్టు (ఫైల్‌ ఫొటో)

గత ఏడాది అక్టోబరులో తుఫాన్‌కు తీవ్రంగా దెబ్బతిన్న సాగునీటి వనరులు

కాలువలు, నదుల గట్లకు గండ్లు

అప్పట్లో తాత్కాలికంగా పూడ్చివేయించిన అధికారులు

శాశ్వత పనులకు రూ.12.49 కోట్లతో ప్రతిపాదనలు

ఐదు నెలలు దాటినా మంజూరుకాని వైనం

మరో నెల రోజుల్లో వర్షాకాలం మొదలు

ఈలోగా పనులు చేయకపోతే అన్నదాతలకు తప్పవు ఇక్కట్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత ఏడాది అక్టోబరులో సంభవించిన మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న సాగునీటి వనరులు, నదుల గట్లు, ఆనకట్టలు వంటివి ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. అప్పట్లో చేపట్టిన తాత్కాలిక పనులు తప్ప, ఇంతవరకు శాశ్వత పనులు చేయలేదు. వీటి మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం సుమారు పన్నెండున్నర కోట్ల రూపాయలు అవసరమని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం మొదలవుతుందని, ఈలోగా పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవని రైతులు అంటున్నారు.

గత ఏడాది అక్టోబరు చివరి వారంలో సంభవించిన మొంథా తుఫాన్‌ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. పలు మండలాల్లో పంట కాలువల గట్లు దెబ్బతిన్నాయి. రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీటిని విడుదల చేయడంతోపాటు పలు గెడ్డల నుంచి వరద నీరు చేరికతో శారదా నది ఉగ్రరూపం దాల్చింది. కొన్నిచోట్ల నది గట్లు కోతకు గురయ్యాయి. రాంబిల్లి మండలం వైలోవ వద్ద ఎడమ గట్టుకు సుమారు 100 మీటర్ల పొడవున భారీ గండి పడింది. దీంతో వైలోవ, మర్రిపాలెం, రజాల, కేజీపాలెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ వచ్చి పరిశీలించారు. గట్టుకు పడిన గండిని ఇసుక బస్తాలతో తాత్కాలికంగా పూడ్చివేశారు. ఇక నారాయణపురం వద్ద మైనర్‌ శారదా నది గట్టు తెగడంతో పంట పొలాలు నీటమునిగాయి. మాకవరపాలెం మండలం జి.కోడూరులో గెడ్డకు గండిపడి సుమారు 300 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. 20 ఎకరాలకుపైగా ఇసుక, మట్టి మేటలు వేసింది. మొంథా తుఫాన్‌ ప్రభావంతో సాగునీటి వనరులకు మరమ్మతులు చేపట్టేందుకు 415 పనులను అధికారులు గుర్తించారు. వీటిలో తాత్కాలిక మరమ్మతులకు రూ.1.83 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.10.66 కోట్లు.. మొత్తం రూ.12.49 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వానికి పంపారు. ఇది జరిగి సుమారు ఐదు నెలలు కావస్తున్నది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. సాగునీటి వనరులకు మరమ్మతులు, నిర్వహణ పనులను సాధారణంగా వేసవిలో చేస్తుంటారు. జూన్‌/ జూలైలో ఖరీఫ్‌ మొదలయ్యేనాటికి పూర్తయ్యేలా జనవరి నుంచే పనులు మొదలుపెడతారు. మరి కొద్ది రోజుల్లో వేసవి ముగుస్తుంది. కానీ గత ఏడాది తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న సాగునీటి వనరులకు మరమ్మతు పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. పనులు త్వరగా చేయకపోతే వర్షాకాలంలో గట్లు కోతకు గురై గండ్లు పడే ప్రమాదం వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించి, మొంథా తుఫాన్‌కు దెబ్బతిన్న సాగునీటి వనరుల మరమ్మతులకు నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు. కాగా మొంథా తుఫాన్‌కు దెబ్బతిన్న సాగునీటి వనరుల మరమ్మతులపై జలవనరుల శాఖ జిల్లా అధికారి త్రినాథంను వివరణ కోరగా.. కొద్ది రోజుల్లో నిధులు మంజూరయ్యే అవకాశం వుందని, వెంటనే పనులు ప్రారంభించి ఖరీఫ్‌ వర్షాలు మొదలయ్యేనాటికి పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

Updated Date - May 13 , 2026 | 01:03 AM