కేజీహెచ్‌కు వైద్యుల కొరత!
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:58 AM
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు లేకపోవడంతో సేవలపై ప్రభావం పడుతోంది.
ఇరవై ఏళ్ల క్రితం మంజూరైన పోస్టుల్లోనే బోలెడు ఖాళీ
వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
పెద్దాస్పత్రికి రోజుకు 3,500 నుంచి 4,000 మంది రాక
ఇన్‌పేషెంట్లుగా మరో 1,500 మంది రోగుల సంఖ్యకు తగ్గట్టుగా పెరగని పోస్టులు
ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించకుంటే కష్టమే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు లేకపోవడంతో సేవలపై ప్రభావం పడుతోంది. సుమారు ఇరవై ఏళ్ల కిందట...అప్పటి అవసరాల మేరకు మంజూరైన పోస్టులతోనే ఇప్పటికీ సేవలు అందించాల్సి వస్తుండడంతో అనేక విభాగాల్లో వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ వైద్యులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నది.
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కేజీహెచ్‌కు ప్రతిరోజూ ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలవారు, పొరుగునున్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి వేలాది మంది రోగులు వస్తుంటారు. ప్రస్తుతం రోజువారీ ఓపీ (అవుట్ పేషెంట్స్) 3,500 నుంచి నాలుగు వేల మధ్య ఉంటుంది. అలాగే, ఇన్‌పేషెంట్లు మరో రెండు వేల మంది ఉంటారు. అయితే రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులు లేరు. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్యను బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న పోస్టులను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
మంజూరైన పోస్టుల్లోనే ఖాళీలు
కేజీహెచ్‌లో సుమారు 40 విభాగాలతో సేవలు అందిస్తున్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాల/కేజీహెచ్‌కు స్పెషాలిటీ విభాగాల్లో 67 ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 57 మంది ఉన్నారు. పది ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో రెండేసి, ఆప్తమాలజీ, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, సర్జికల్ అంకాలజీ విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్ పోస్టు చొప్పున ఖాళీగా ఉన్నాయి. అలాగే, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 60 మంజూరు కాగా, మూడు ఖాళీలు ఉన్నాయి. ఆప్తమాలజీ, జనరల్ సర్జరీలో ఈ ఖాళీ ఉన్నాయి. 181 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 165 మంది ఉన్నారు. మరో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డెర్మటాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాల్లో నాలుగేసి, పీడియాట్రిక్ సర్జరీలో రెండు, ఈఎన్‌టీ, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, న్యూరో సర్జరీ, యూరాలజీ, మెడికల్ అంకాలజీ విభాగాల్లో ఒక్కొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. అలాగే, నాన్ క్లినికల్ విభాగానికి సంబంధించి 16 ప్రొఫెసర్ పోస్టులు మంజూరుకాగా, మూడు ఖాళీ ఉన్నాయి. బయోకెమిస్ర్టీ, పెథాలజీ, ఫోరెన్సిక్ డిపార్టుమెంట్‌లో ఒక్కొక్క పోస్టు చొప్పన ఖాళీ ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 22 మంజూరు కాగా, మూడు ఖాళీ ఉన్నాయి. ఫోరెన్సిక్ మెడిసిన్‌లో రెండు, బయో కెమిస్ర్టీలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. అలాగే, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 74 మంజూరుకాగా, ఆరు ఖాళీలు ఉన్నాయి. అనాటమీలో మూడు, బయో కెమిస్ర్టీలో రెండు, మైక్రోబయాలజీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది.
రెట్టింపు చేస్తే మెరుగైన సేవలు
ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఇంకా రోజుకు సుమారు 200 వరకు మేజర్, మైనర్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంతోపాటు అదనపు పోస్టులను మంజూరుచేయాల్సి ఉంది. మరో 150 పోస్టులను మంజూరుచేస్తే, రోగులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా రోగుల తాకిడి పెరుగుతున్నందున కొన్ని విభాగాల్లో అదనపు యూనిట్లు ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఉంది. దానిపై కూడా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.