వాణిజ్య సిలిండర్లకు కొరత
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:37 AM
జిల్లాలో వాణిజ్య సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. యుద్ధం నేపథ్యంలో ఎల్‌పీజీ దిగుమతి నిలిచిపోయింది.
సరఫరాలో జాప్యం
ఆగితే ఇబ్బందే
మూతపడనున్న మెస్‌లు, హోటళ్లు
గృహ వినియోగ సిలిండర్లకు డిమాండ్
బ్లాకులో ఒక్కొక్కటి రూ.1,300కు విక్రయం
విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వాణిజ్య సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. యుద్ధం నేపథ్యంలో ఎల్‌పీజీ దిగుమతి నిలిచిపోయింది. ఇప్పటికే ఎల్‌పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. మరో వైపు కేంద్రం వాణిజ్య అవసరాలకు ఎల్‌పీజీని ఇవ్వవద్దని, కేవలం గృహ అవసరాలకే కేటాయించాలని ఆదేశించింది. అదే సమయంలో కృత్రిమ కొరత సృష్టించవద్దని హెచ్చరించింది. ఉత్పత్తి పెంచాల్సిందిగా ఆయిల్ రిఫైనరీలను కూడా ఆదేశించింది. ఇవన్నీ బాగానే ఉన్నా విశాఖపట్నంలో గ్యాస్ డీలర్లు బుక్ చేసిన వాణిజ్య సిలిండర్లను మాత్రం పలు కంపెనీలు డెలివరీ ఇవ్వలేదు. కేవలం గృహ వినియోగ సిలిండర్లను మాత్రమే సరఫరా చేశాయి. కారణాలు ఏమిటో వెల్లడించలేదు. బుధవారం అయినా సరఫరా చేస్తారో లేదో తెలియదని పలువురు డీలర్లు చెబుతున్నారు.
వ్యాపారాలు చేసే వారికి ఇబ్బందే
వాణిజ్య సిలిండర్లను వ్యాపారులు ఉపయోగిస్తారు. టిఫిన్ సెంటర్లు, మెస్‌లు, హోటళ్లు వీటిని కొనుగోలు చేస్తాయి. ఒక్కొక్కటి 19 కిలోల బరువు ఉంటుంది. తాజాగా పెంచిన ధర ప్రకారం ఈ సిలిండర్ ధర రూ.1,938.50. చాలా మంది డీలర్లకు మంగళవారం ఈ సిలిండర్లు రాకపోవడంతో ఖాతాదారులకు సరఫరా చేయలేకపోయారు. హోటళ్లు, మెస్‌లు ఏ రోజుకారోజు తీసుకుంటాయి. పెద్ద హోటళ్లు అయితే స్టాక్ పెట్టుకుంటాయి. వాటిని రోజు విడిచి రోజు రీఫిల్ చేసుకుంటాయి. మంగళవారం ఒక్కరోజే సరఫరా ఆగడంతో పెద్దగా దాని ప్రభావం కనిపించలేదు. ఉన్న కొద్దిపాటి గ్యాస్‌తో చాలామంది సర్దుకుపోయారు. బుధవారం కూడా వీటిని ఇవ్వకపోతే ఇబ్బందులు మొదలవుతాయి.
బ్లాకులో విక్రయాలు
తోపుడు బండ్లపై టిఫిన్లు అమ్మేవారు, రోడ్ల పక్కన దుకాణాలు నడిపేవారు వాణిజ్య సిలిండర్లు ఉపయోగించరు. గ్యాస్ డెలివరీ బాయ్‌లకు సిలిండర్‌కు వంద రూపాయలు అదనంగా ఇచ్చి అవసరమైనన్ని తీసుకుంటారు. ఇది చాలా కాలంగా జరుగుతోంది. గ్యాస్ కంపెనీలు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఓటీపీల విధానం తీసుకువచ్చినా బాయ్‌లు వాటిని అమ్ముకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగడంతో గృహ వినియోగి సిలిండర్లకు డిమాండ్ ఏర్పడింది. మంగళవారం ఒక్కో సిలిండర్‌కు బాయ్‌లు రూ.1,300 చొప్పున వసూలు చేశారు. పెద్ద హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర బాగానే ఉందని చిన్న వ్యాపారులు మారు మాట్లాడకుండా తీసుకున్నారు.
ఆగితే ఇబ్బందే
వాణిజ్య సిలిండర్లను ఒకరోజు ఆపడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదని, అయితే ఫిల్లింగ్ స్టేషన్లలో ఫిల్లింగ్ చేయకపోయినా, సరాఫరా ఆగినా కృత్రిమ కొరత ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయని వ్యాపారులు అంటున్నారు. చిన్న హోటళ్లు, మెస్‌లు మూతపడతాయి. టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగిపోతాయి. ఇవన్నీ సామాన్యులకు భారంగా పరిణమించే ప్రమాదం ఉంది. అందుకని పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తమై కృత్రిమ కొరత లేకుండా, అందరికీ గ్యాస్ అందేలా తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.